పార్టీలకు ముకుతాడేదీ? | there is no restrictions for political parties | Sakshi
Sakshi News home page

పార్టీలకు ముకుతాడేదీ?

Published Mon, Apr 14 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

పార్టీలకు ముకుతాడేదీ?

పార్టీలకు ముకుతాడేదీ?

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

మామూలు సొసైటీని క్రమబద్ధీకరించడానికి ఒక చట్టం ఉంది. కంపెనీల పైన అదుపు కంపెనీ లా బోర్డుకు ఉంది. బ్యాంకుల నెత్తిన రిజర్వ్‌బ్యాంక్ అంకుశం మోపుతూ ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలకు కూడా ఒక క్రమపద్ధతి ఉండే చట్టాలున్నాయి. రాజకీయ పార్టీలకే ఏ అదుపూ ఆజ్ఞలు లేవు. వారిని అడిగేవారు లేరు. ఇంతపెద్ద రాజ్యాంగం రాసిన పెద్దలు, ప్రజాప్రాతినిధ్య చట్టాలు రూపొందించిన మేధావులు రాజకీయ నాయకులని సక్రమంగా నడిపించే చట్టాలను రాయలేకపోయారు. స్వతంత్ర సమరం నడిపి రాజ్యాంగ రచన చేసిన ధీశాలురే కానీ తరువాత కాలంలో రాజకీయ పార్టీలను అదుపు చేసే ఒక శక్తి అవసరం అవుతుందని వారు ఊహించలేకపోయారు.

ఎన్నికల సంఘం.. కాగితం పులి
రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అన్న పదమే రాలేదు. రాయలేదు. ఎన్నిక కావలసిన వ్యక్తికి అర్హతలు రాశారు. ఎన్నికైన వ్యక్తి బాధ్యతలు రాశారు. కానీ వారిని ఎంపిక చేసే రాజకీయ పార్టీకి సంబంధించిన రీతి రివాజులు, నీతినియమాలు లేవు. ఎన్నికల కమిషన్ మన దేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ. దానికి విస్తృతమైన అధికారాలున్నమాట నిజమే. కానీ, ఆ అధికారాలు ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేస్తాయి. తరువాత ఎన్నికైన ప్రభుత్వం కనుసన్నల్లో మెలగవలసిందే. ఎన్నికల సంస్కరణల విషయంలో సలహాలు చెప్పడం తప్ప రాజకీయ నాయకులను అదుపు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు.

కనీసం రాజకీయ పార్టీలు నిర్దేశించిన అర్హతలను పాటించే విధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం కానీ, ఆ అర్హతను కోల్పోయిన పార్టీల గుర్తింపును, అసలు పార్టీని రద్దుచేసే అధికారాలు గానీ ఎన్నికల కమిషన్‌కు లేనేలేవు. కొత్త పార్టీ ఏర్పడగానే ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. శాశ్వతంగా కొనసాగవచ్చు. రాజకీయ పార్టీకి రద్దు సమస్యే లేదు. గుర్తింపు లభించడానికి కొన్ని అర్హతలు నిర్దేశించారు. గుర్తింపు లేకపోయినా గుర్తు ఇస్తారు.

ఇక ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా జనానికి గుర్తున్నా లేకపోయినా పాత గుర్తుతో మిగిలిపోతుంది. కొత్త పార్టీలకు గుర్తులే దొరకనన్ని పార్టీలు మన దేశంలో ఉన్నాయి. చివరకు గుర్తులు దొరకకపోవడం వల్ల చెప్పులను, చీపురుకట్టలను కూడా ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడింది. జై సమక్యాంధ్ర పార్టీ నేతలు ఏ కారణం చేతనైనా ఇంకేపార్టీలో కలిసినా సరే కనీసం చెప్పుల గుర్తుకూడా మరొకరికి దక్కదన్న మాట. ఇదీ మన ఎన్నికల చట్టం. రిజిస్టర్ చేయవచ్చు కానీ డీరిజిస్టర్ చేసే అధికారం లేని కాగితం పులి ఎన్నికల సంఘం.

రాజకీయ పార్టీ అంటే రాజ్యాంగం దృష్టిలో కొందరు వ్యక్తుల సమూహం మాత్రమే. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా సరే కొందరు కలిసి పార్టీ పెట్టవచ్చు. అది ప్రాథమిక హక్కు. తానొక్కడే అయినా వెంట ఎవరూ లేకపోయినా సరే అది వ్యక్తుల సంఘం అయితే చాలు. ఇంతమంది సభ్యులు ఉండాలన్న నియమం కూడా లేదు. రాజకీయ పార్టీ పెట్టడం చాలా సులభం. కొన్ని షరతులు ఉన్నమాట వాస్తవమే. భారతదేశ సమగ్రతకు సమైక్యతకు కట్టుబడి ఉండాలి. అయితే ప్రతి పార్టీ తప్పనిసరిగా ఏర్పడిన నెలరోజుల్లోగా రిజిస్టర్ చేయడం కోసం దరఖాస్తు సమర్పించి తీరాలని ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్టికల్ 29ఎ(5) నిర్దేశిస్తున్నది.

భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని కూడా ఈ సెక్షన్ షరతు విధిస్తోంది. రిజస్టర్ చేయాలంటే ఆ పార్టీ ఒక మెమొరాండం ఆఫ్‌రూల్స్ అండ్ రెగ్యలేషన్స్ ఇవ్వాలి. ఇదివరకు పార్టీల మెమొరాండం తీసుకుని పేరు మార్చి ఇచ్చేవారు. సొంతంగా ఆలోచించి సొంత నియమావళి రాసుకునే తీరిక, ఓపిక చాలా తక్కువ. ఈ మెమొరాండం ఇచ్చి రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన తరువాత ఈసీ రిజిస్ట్రేషన్‌కు అంగీకరిచవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం.

పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్‌టీఐ కింద రాజకీయ పార్టీలు ఎన్ని నియమాలను పాటించాయో తెలుసుకుందామని ప్రశ్నలు వేసింది. మనకు 1196 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలున్నాయి. వీటిలో కేవలం 98మాత్రం 20వేల రూపాయలకు మించిన విరాళాల వివరాలతో నివేదికలు ఇచ్చాయి. అంటే కేవలం 8శాతం పార్టీలు నియమం పాటించాయి. అందుకు వాటికి లభించే కితాబు ఏమీ ఉండదు. ఆ నివేదికలో లోపాలు, అవాస్తవాలపైన విచారణలు ఉండకపోవచ్చు.

నివేదిక ఇవ్వని పార్టీలకు పన్ను రాయితీలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆదాయపు పన్ను శాఖకు చెప్పలేదని ఈ ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానంలో తేలింది. మిగతా మార్గదర్శక సూత్రాల్లోని ఆర్టికల్ 8 రూల్ 3(1),(19) ప్రకారం ఆడిట్ జరిపించిన వార్షిక ఆర్థిక నివేదికలు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోగా ఇవ్వాలి. ఎన్ని పార్టీలు ఇచ్చాయని ఆర్‌టీఐ కింద పీఐఎఫ్ సంస్థ అడిగింది. 2011-12లో కేవలం 175 పార్టీలు నివేదికలు ఇచ్చాయి. అంటే 85శాతం పార్టీలు నివేదికలు ఇవ్వలేదు.

డీ రిజిస్ట్రేషన్ అధికారాలు ఉన్నా...
రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసే సందర్భంలో ఎన్నికల సంఘం అర్థ న్యాయసంస్థలా వ్యవహరిస్తోంది. కానీ ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత దానికి ఏ అధికారాలూ లేవు. డీరిజిస్టర్ చేయడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. కానీ ఆర్టికల్ 29ఎ కింద నాలుగు సందర్భాల్లో మాత్రమే డీరిజిస్టర్ చేయవచ్చు. (1) మోసపు మార్గాల ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ సాధించిందని తెలిస్తే, (2) ప్రభుత్వం ఆ పార్టీని చట్ట వ్యతిరేకం అని ప్రకటిస్తే (3) పార్టీ స్వయంగా తమ పార్టీ రద్దయిందని ఇక పనిచేయలేదని లేదా పార్టీ నియమావళిని మార్చుకున్నదని ప్రకటించినా లేదా (4) చట్టం ప్రకారం పనిచేయడం లేదని తేలిన సందర్భాల్లో డీరిజిస్టర్ చేయవచ్చు.

నిజానికి డీరిజిస్టర్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ విభజించింది. కొన్ని అధికారాలు ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఇచ్చి, మరికొంత అధికారాన్ని స్వయంగా రద్దు చేసుకునేందుకు పార్టీలకే ఇచ్చింది. నాలుగో నియమం పరిశీలిస్తే ఈసీ ఫలానా అంశంలో చట్టం ప్రకారం పనిచేయలేదని తేల్చి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు. షరతుల ప్రకారం రాజ్యాంగం పట్ల అవిధేయత కనిపించినా, చట్టాలను ఉల్లంఘించినా, పార్టీ అభ్యర్థి కానీ కార్యవర్గ నాయకులు గానీ నేరాలకు పాల్పడినా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే భావించి వారి పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. దానికి దమ్మున్న నాయకుడు రావాలి. టీఎన్ శేషన్ వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్లు వస్తే ఈ రద్దు అధికారాలు అంతర్లీనంగా ఉన్నాయనీ, వాటిని వినియోగించి చట్టవ్యతిరేక పార్టీలను రద్దుచేసే అధికారాలను ప్రయోగించవచ్చని తేలుతుంది.

సెక్యులరిజం పాటించని పార్టీలు, మత కలహాలు సృష్టించేవారు, ఇతర మతాల వారిని చంపించిన వారు ఉన్న పార్టీలను ఎందుకు రద్దు చేయలేదు? సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన వారు, ప్రమాణాలు చేసి భంగం చేసినవారు, అబద్ధపు ప్రమాణ పత్రాలు రాసినవారు, వరకట్న నేరాలు చేసినవారు, ఫిరాయించిన  వారు, రాజ్యాంగం ప్రతులు చింపేసేవారు, అసెంబ్లీ, లోక్‌సభల్లో చట్టాల ప్రతులను చింపి మైకులు విరిచి, కళ్లలో మిరియాల నీరు చల్లి, కత్తులు ఝళింపించే వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఒక్కపార్టీ కైనా ఎన్నికల కమిషనర్ నోటీసు కూడా పంపే స్థితిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రూల్ ఆఫ్ లా అంటే సమపాలన, ఇవే పనులు కంపెనీలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కేసులు పెట్టరా?
 
 
మొక్కుబడిగా వార్షిక నివేదికలు
ఆర్టికల్ 29సి కింద రాజకీయ పార్టీ ఏటేటా ఎన్నికల సంఘానికి తమకు 20వేల రూపాయలకు మించిన విరాళాలు ఎన్ని వచ్చాయో, ఎవరిచ్చారో వివరిస్తూ ఒక వార్షిక నివేదిక ఇస్తానని వాగ్దానం చేయాలి. ఒకవేళ వార్షిక నివేదిక ఇవ్వకపోతే ఆ రాజకీయ పార్టీకి విరాళాలు వసూలు చేసే అధికారం గానీ పన్ను రాయితీలుగానీ రావు. కనుక ఏదో ఒక నివేదిక ఇస్తారు.

ఈ మొక్కుబడి నివేదికలో అబద్దాలున్నా రిజిస్ట్రేషన్ రద్దుచేసే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం మనదేశపు వింత. తరువాత 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 29ఎ ఆర్టికల్ కింద రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో ఆర్టికల్ 8 రూల్3(1) రూల్ 3(19) ప్రకారం తప్పనిసరిగా ప్రతి రాజకీయ పార్టీ ఆడిట్ చేసిన వార్షిక ఆర్థిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. 29ఎ(6) కింద ఎన్నికల సంఘం ఇంకే వివరాలైనా అడగవచ్చు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement