కామన్ సెన్స్ | Common Sense | Sakshi
Sakshi News home page

కామన్ సెన్స్

Published Mon, Apr 28 2014 1:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

కామన్ సెన్స్ - Sakshi

కామన్ సెన్స్

 రాజకీయాలంటే సంపన్నులు ఆడుకునే క్రీడ...అధికార పీఠాన్ని అందుకోవడానికి సమ ఉజ్జీల మధ్య జరిగే పోరు... ఇందులో సాధారణ ప్రజలకు చోటు లేదు...ఐదేళ్లకోమారు ఓటు వేసి పక్కకు తప్పుకోవడమే వారి పని...! అనేది జనసామాన్యంలో ఉండే అభిప్రాయం. కానీ అందరూ అలా అనుకోవడం లేదు...సామాన్యుడు ఈ రాజకీయ దిగ్గజాలను ఎదుర్కోగలడని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి.

అదే స్ఫూర్తిగా ఇపుడు గల్లీగల్లీలోనూ సామాన్యులు ఎన్నికల వేదికపైకి వస్తున్నారు...తమ గొంతు వినిపించాలని తపిస్తున్నారు...అలాంటి అ‘సామాన్యులే’ ఈ అభ్యర్థులు. ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... ఎలుగెత్తి ఘోషిస్తున్నారు... ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని కోరుతున్నారు. సామాన్యుడికి అధికార పీఠం దక్కాలని ఆశిస్తున్నారు... గెలుపోటములను పట్టించుకోకుండా ప్రజల్లో గుర్తింపు పొందడమే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నారు...
 
 ఎన్నికల్లో సామాన్యులు...  ఆశయమే ఊపిరి...  మనోధైర్యమే పెట్టుబడి

 అవినీతిని రూపుమాపుతా...
 ఇతని పేరు సిరిశెట్టి మల్లేశం. రామగుండం అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తమలపాకులు విక్రయిస్తుంటారు. విజయవాడ నుంచి వచ్చే తమలపాకులను స్థానికగా ఉన్న పాన్ టేలాలకు విక్రయిస్తుంటాడు. ‘కౌన్సిలర్ నుంచి దేశ ప్రధాని వరకు అవినీతి, లంచగొండితనం పెరిగిపోయింది. ప్రజలకు మంచి పరిపాలనను అందించాలనే తపన నాలో కలిగింది. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను.’ అని మల్లేశం చెబుతున్నాడు.

 నీళ్లు అమ్ముకుంటూ ఎమ్మెల్యేగా పోటీ
 ఈయన పేరు  నడిమింటి శ్రీనివాస్, జడ్చర్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటింటికి ఓ వ్యాన్‌లో మినరల్ వాటర్‌ను విక్రయిస్తూ జీవిస్తున్నారు. కొంత కాలం టీడీపీ, ప్రజారాజ్యం, వైఎస్‌ఆర్‌సీపీలలో కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈయనకు ఆటో రిక్షా గుర్తును కేటాయిం చారు.  ఇంటింటికి నీటిని సరఫరా చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకున్నా ప్రజాసేవ చేయాలనే తపన ఈయనది. ప్రజాసేవతో పాటు నియోజక వర్గాన్ని అబివృద్ధి పరచాలని ఆకాంక్ష.
 
 రాజకీయాల్లో మార్పు రావాలి
 ఈయన పేరు ములుకుంట్ల సుమన్. ఇతను కూడా సామాన్యుడే. గోదావరిఖని మార్కండేయకాలనీలో కంప్యూటర్, ఇంటర్‌నెట్ సెంటర్‌ను నిర్వహిస్తుంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో ఎవరు నచ్చకపోవడంతో తానే రామగుండంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. ‘ప్రస్తుతమున్న రాజకీయాలు అవినీతితో కంపుకొడుతున్నాయి. వాటిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. అందుకే మార్పు తీసుకురావాలనే కాంక్షతోనే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నాను...’ అంటున్నారు.  
 సామాన్యుడి సత్తా చాటాలని..
 ఈయన పేరు కామర్స్ సత్యనారాయణ (48). లోక్‌సత్తా తరఫున బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం ఆయనిది. సత్యనారా యణ నిరుపేద కుటుంబానికి చెందిన నిరక్షరాస్యుడు. ఎలాంటి స్థిరచరాస్తులు లేవు. వృత్తి రీత్యా చిరువ్యాపారి. ప్రస్తుత రాజకీయాల్లో మార్పురావాలంటున్నారు.  ప్రజా సేవ చేయాలని, సుపరిపాలన లోక్‌సత్తా పార్టీతోనే సాధ్యమవుతుందనే ఎన్నికల్లో నిలిచానని చెబుతున్నారు.
 
 ఇంటి పనివాళ్ల ప్రతినిధిగా..
 సాయల రేణుక.. హేమాహేమీలు పోటీపడుతున్న ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏపీ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నాయకురాలైన రేణుక.. నియోజకవర్గంలోని ఆరు లక్షల మంది ఇంటి పనివాళ్ల ప్రతినిధిగా వారి గొంతును అసెంబ్లీలో వినిపించాలనే లక్ష్యంతో పోటీకి దిగారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పటి నుంచి ఇళ్లలో పాచి పనిచేస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఏపీ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తరపున చాలా కాలంగా పోరాడుతున్నారు.
 
 సికింద్రాబాద్ నుంచి ఆటోవాలా
 ఆటోలో ప్రచారానికి బయలుదేరిన ఈయన పేరు ఆర్త సత్తిరెడ్డి. సీతాఫల్‌మండికి చెందిన సత్తిరెడ్డి.. ఆటోడ్రైవర్. సికింద్రాబాద్ నుంచి నాలుగోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఓటమిలో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆయన గెలుపోటములను పక్కనపెట్టి మళ్లీ పోటీకి దిగారు. ఆటోలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమమే తన ధ్యేయమని చెబుతున్నారు.
 
 డబ్బులేని రాజకీయాల కోసం...

 ‘డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయాలు చేయాలనేది నా తపన. అందుకే నామినేషన్ వేశాను.’ అంటున్నారు సబ్బని హరీష్. ఈయన కూడా రాజకీయ నేపథ్యం లేని సామాన్య వ్యక్తే. గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో ఫొటో స్టూడియోతో పాటు జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తుంటారు. రామగుండం అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 
 ఖానాపూర్ బరిలో గోండు రైతు

 ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చెందిన  మెస్రం ఆనంద్‌రావు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆనంద్‌రావుకు 11 ఎకరాల భూమి ఉంది.  గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు గోండు, కొలాం, తోటి, పర్థాన్ వంటి వారికి అందడం లేదని అందుకే తన లాంటి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
 
 సామాన్యులకూ అవకాశం ఉండాలి...
 ఈయన పేరు సుద్దాల రమేష్. రామగుండం అసెంబీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఎన్టీపీసీలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ‘బాగా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలాంటి డబ్బులేని వారు కూడా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది.. అందుకే నామినేషన్ వేసి పోటీ చేస్తున్నా.’ అంటూ తాను ఎందుకు పోటీ చేస్తున్నదీ తెలిపారు. గెలుపోటములు ప్రధానం కాదు.పోటీ చేయడం ద్వారా గుర్తింపు పొందడమే లక్ష్యమని అంటున్నారు.
 
 ‘దర్జీ’గా బరిలోకి...
 చార్మినార్ శాసనసభ నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె. వెంకటేశ్ కుటుంబీకులు నిజాం కాలం నుంచి దర్జీ (టైలరింగ్) వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరానికి చెందిన వెంకటేశ్ సైతం వృత్తిరీత్యా దర్జీ. ఆయన కుటుంబం పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడు రాధయ్య, ఆయన కుమారుడు కె. ప్రకాశ్ దుస్తులను కుట్టడంలో నైపుణ్యం కలిగినవారే. తండ్రి ప్రకాశ్‌తో కలిసి వెంకటేశ్ 1987 నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరోవైపు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాజీవ్ సేవా సమితిని ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
 
 అందని ద్రాక్ష కాకూడదు
 ఈయన పేరు పవార్ మన్యానాయక్.  వృత్తి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. చదివింది ఏడో తరగతే అయినా  ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష మెండు. గెలుపోటములు మాట పక్కన పెడితే ‘సామాన్యుల’కు రాజకీయాలు అందని ద్రాక్ష కాకూడదనేది ఆయన అభిలాష. అదే లక్ష్యంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం రెండోసారి పోటీ చేస్తున్నారు.   ‘డబ్బు’ రాజకీయాలను శాసించే సంస్కృతి మారాలన్నదే నా లక్ష ్యం...’ అంటున్నారు.  
 
 పాలకుల పాపాలపై ‘పాకాల’స్త్రం
 ‘రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల్లో 730 బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా యంత్రాంగం 220 కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకే ఎన్నికల తర్వాత కోర్టు ధిక్కరణ కేసు వేస్తున్నాను..’ అంటున్నారు పాకాల శ్రీహరిరావు. మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారిని ఆదుకునే విషయంలో పాలక, విపక్షాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆయన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. ‘వైఎస్ మరణాంతరం జీవో 421 అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంద ని, రైతులకు న్యాయం జరగలేదని అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పాకాల శ్రీహరిరావు తెలిపారు.
 
 ఎన్నికల తీరు మారాలి..

 వినీత్ కుమార్‌గౌడ్ బాల్కొండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీకాం చదిని ఈయన ప్రస్తుతం నిరుద్యోగి. మిత్రుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ‘ఎంతో మందికి నాయకత్వ లక్షణాలు ఉన్నా.. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలువలేం అనే ఉద్దేశంతో ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడుతు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ఎవరికి వారు మాకెందుకులే అనుకునడం వల్లనే ఎన్నికల తీరు ఇలా మారింది. భవిష్యత్ తరాల వారైనా ఎన్నికల తీరును మార్చుతారని భావిస్తు పోటీలో ఉన్నాను...’ అని అంటున్నారు.
 
 అవినీతిని చూసి విసిగిపోయా
ఈయన పేరు... రత్నావత్ రమేశ్ (35). మహబూబాబాద్ శివారు బాబూనాయక్ తండా. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగారు. చివరికి రూ 10,000 లంచం ఇస్తే బిల్లు మంజూరైందని, ఇదే సమయంలో పలు అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగే ఎంతో మందిని చూసి చలించిపోయానని,  ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి నిరసనగా గళమెత్తడానికే  అసెంబ్లీ బరిలో నిలిచానని రమేశ్ తెలిపారు.
 
 అడవి బిడ్డల రక్షణకోసం..
  ‘అడవిపై ఆధారపడి జీవిస్తూ రాజకీయంగా నోరులేని ఆదివాసీల జాతిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జల సమాధి చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారు.. దీనికి రక్షించేందుకు చేపట్టే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరేందుకే ఎన్నికల బరిలో దిగాను..’ అంటున్నారు కాకి భాస్కర్. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ తరపున తనతోపాటు మరో 13 మంది బరిలో దిగినట్టు ఆయన తెలిపారు. ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులుగా, స్పర్శ సామాజిక చైతన్య అధ్యయన వేదిక నిర్వాహకులుగా ఆయన సుపరిచితుడు. ఎన్నికలంటే ఎత్తులు, పొత్తులు, గెలవడం, ఓడడం మాత్రమే కాదు. దానిని పోరాట వేదికగా మార్చాలన్నదే లక్ష్యమని చెప్పారు.
 
కొత్త రాజకీయాలను కోరుకుంటున్నా
 ‘మందీమార్బలం, డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకునే శక్తి నాకు లేదు. ఈ పోటీలో గెలుస్తానని కూడా అనుకోవడం లేదు. ఎన్నికల్లో నిజాయితీపరులను ఎన్నుకోవాల్సిన అవసరం, డబ్బుకు ఓటును అమ్మడం వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు చెప్పడమే నా లక్ష్యం’ అంటున్నారు చార్‌మంజుదార్. కురవి మండలం బలుపాల శివారు లింగ్యాతండాకు చెందిన ఈయన డోర్నకల్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో మెడిసిన్ ఆంత్రోపాలజీపై పీహెచ్‌డీ చేస్తున్న మంజు దార్ అవినీతిరహిత సమాజాన్ని చూడాలన్నదే తన లక్ష్యమంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement