బందరులో లంగరేసేదెవరు? | Machilipatnam is a historical identity | Sakshi
Sakshi News home page

బందరులో లంగరేసేదెవరు?

Published Thu, May 1 2014 1:24 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బందరులో లంగరేసేదెవరు? - Sakshi

బందరులో లంగరేసేదెవరు?

మచిలీపట్నానికి చారిత్రక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచే వర్తక కేంద్రంగా వర్ధిల్లుతోంది. రాజకీయంగానూ ఇక్కడ భిన్న వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. నాలుగు పార్టీల తరఫున అభ్యర్థులు బరిలోకి దిగి...అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే నడుస్తోంది.
 
 యిర్రింకి ఉమామహేశ్వరరావు-మచిలీపట్నం, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ తరఫున కొనకళ్ల నారాయణరావు, కాంగ్రెస్ నుంచి శిష్ట్లా రమేష్, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థిగా కమ్మిలి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

సానుకూల పవనాలు...
సమైక్యాంధ్ర నినాదంతో పోరు సాగించిన వైఎస్సార్ సీపీకి ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ‘సమైక్య’ పరిరక్షణకు పోరాడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా ఆయన... వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. 

 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే వాటిని సమర్థవంతంగా కొనసాగిస్తారని తెలియజేస్తున్నారు. ఇందుకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. కాగా, పార్థసారథి తండ్రి కొలుసు పెద రెడ్డయ్య గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జిల్లాలో ఏకైక మంత్రిగా పనిచేసిన పార్థసారథికి కూడా అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ ఉంది. సామాజికంగానూ పట్టుంది. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో పార్లమెంటులో అడుగుపెడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు.

కొనకళ్ల డీలా...
బందరు లోక్‌సభ స్థానంలో మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు డీలా పడ్డారు. గత ఎన్నికల్లో ఆయనకు సామాజిక సమీకరణలు కలిసిరావడంతో ఎంపీగా గెలిచారు. అయితే, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. గతంలో ఆయనకు ఓట్లు తెచ్చి పెట్టిన గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం సీన్ మారింది. అక్కడ పార్టీకి సానుకూల పరిస్థితి లేకపోవడం కొనకళ్లను ఆందోళనకు గురిచేస్తోంది.


కాంగ్రెస్ ఖాళీ.. ఆదరణ లేని జేఎస్పీ
రాష్ట్ర విభజన సెగతో బందరులో కాంగ్రెస్ అడ్రెస్ గల్లంతైంది. జాతీయ పార్టీగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ సరైన అభ్యర్థి దొరకలేదు. విధిలేక గుడివాడకు చెందిన శిష్ట్లా రమేష్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్ దక్కలేదు. గత మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగానూ తెరపైకి వచ్చారు. 23వ వార్డులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక జేఎస్పీ అభ్యర్థి కమ్మిలి శ్రీనివాస్ ప్రచారంలో కాంగ్రెస్ కంటే కాస్త ముందున్నా..రేసులో మాత్రం వెనుకబడిపోయారు.
 
 
ఇదీ చరిత్ర
మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. గతంలో ఇది ఎన్నోసార్లు రుజువైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన మోటూరు హనుమంతరావు(సీపీఎం), మండలి వెంకటకృష్ణారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కావూరు సాంబశివరావు, అంబటి బ్రహ్మణయ్య, బూరగడ్డ నిరంజన్‌రావు వంటి వారికి సైతం ఇక్కడ ఓటమి తప్పలేదు. ఒకమారు సినీనటుడు కైకాల సత్యనారాయణ(1996-టీడీపీ)ను ఆదరించిన ఓటర్లు.. మరోమారు సినీగ్లామర్ సైతం పనిచేయదంటూ తిరస్కరించారు. ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు(1984,1989,1998) ఎంపీగా గెలిచిన కావూరు సాంబశివరావు గత రెండు పర్యాయాలు ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే మాగంటి అంకినీడు ఇక్కడి నుంచి రెండు సార్లు(1977, 1980) ఎంపీగా గెలిచారు. ఆయన గుడివాడ లోక్‌సభ స్థానం నుంచి కూడా మూడు పర్యాయాలు ఎన్నికై రికార్డు సృష్టించారు.

 

మచిలీపట్నం లోకసభ స్థానం ఏర్పడిన తొలి ఎన్నికల(1952)లో  సీపీఐ అభ్యర్థి సనకా బుచ్చికోటయ్య గెలుపొందారు. గాంధేయవాదిగా పేరున్న మండలి వెంకట కృష్ణారావు(కాంగ్రెస్)ను ఇక్కడి ప్రజలు 1957లో పార్లమెంటుకు పంపారు. ఆయన 1962లోనూ పోటీచేసి, ఇండిపెండెంట్ అభ్యర్థి మండల వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు.  యార్లగడ్డ అంకినీడు ప్రసాద్(1967 -కాంగ్రెస్), మేడూరి నాగేశ్వరరావు(1971-కాంగ్రెస్), కొలుసు పెదరెడ్డయ్య(1991-టీడీపీ), అంబటి బ్రాహ్మణయ్య (1999-టీడీపీ), బాడిగ రామకృష్ణ (2004-కాంగ్రెస్), కొనకళ్ల నారాయణరావు (2009-టీడీపీ) ను కూడా బందరు ప్రజలు ఆదరించారు.
 

అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు
బందరు
తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ దిశగా సాగిపోతున్నారు. నానికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఇది కలిసొచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు   ప్రజలతో సంబంధాలు తక్కువ. కాంగ్రెస్ నుంచి చలమలశెట్టి ఆదికిరణ్,  జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గనిపిశెట్టి గోపాల్ పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం పెద్దగా కన్పించడం లేదు.
 
పెడన
అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన కుటుంబానికి నియోజకవర్గంలో పట్టుంది. సొంత కేడర్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం. టీడీపీ నుంచి మాజీ చీఫ్ విప్ కె.వెంకట్రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెంటి విశ్వేశ్వరరావు, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వాకా వాసుదేవరావు బరిలో నిలిచారు.
 
గుడివాడ
వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రంగంలోకి దిగారు. ‘హ్యాట్రిక్’ కొట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ మంచి క్రేజ్ ఉంది. టీడీపీ అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో లేరు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అట్లూరి సుబ్బారావు నుంచి పోటీ నామమాత్రమే.
 
గన్నవరం
వైఎస్ మిత్రుడు, ప్రముఖ వైద్యుడు దుట్టా రామచంద్రరావు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖరీదైన వైద్యాన్ని సైతం పేదలకు తక్కువ ఖర్చుతో అందించి మన్ననలు అందుకున్నారు. వల్లభనేని వంశీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వివాదాస్పదుడిగా పేరుగాంచారు. ఇది ప్రతికూలంగా మారే అవకాశముంది. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ తరపున, బోయపాడి సౌజన్య జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.
 
పెనమలూరు

జెడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కేవీఆర్ విద్యాసాగర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన యువకుడు, విద్యావంతుడు. ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నారు. తండ్రి హయాంలో చేసిన అభివృద్ధి కూడా లాభించనుంది. బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చలసాని పండు అనుచరుడిగా మెలిగిన ఆయన అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. నేరెళ్ల శోభన్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 
పామర్రు
వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన ఉన్నత విద్యావంతురాలు. లెక్చరర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సమత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. టీడీపీ తరఫున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.  ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే డీవై దాసు, జేఎస్పీ తరఫున పాలడుగు డేవిడ్‌రాజు బరిలోకి దిగారు.
 
అవనిగడ్డ
వైఎస్సార్ సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు మొదట్నుంచీ అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నారు. దివిసీమ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఉలిగడ్డ, పెనుమూరు వారధి, మత్స్యకారుల సంక్షేమం కోసం అనేకసార్లు పోరాడారు. టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ బరిలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ వారు వెంట వెళ్లడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా మత్తి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు.  
 
సమ్‌థింగ్ స్పెషల్
ఇక్కడ ఓడినా, గెలిచినా.. వేరే చోట ఓకే!

బందరు లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ చేసి ఓడిన, గెలిచిన నేతలు  మరోచోట మెరిశారు. అలాంటి వారిలో మండలి వెంకట కృష్ణారావు, అంబటి బ్రాహ్మణయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేపీ రెడ్డియ్య, సనకా బుచ్చికోటయ్య, కావూరు సాంబశివరావు వంటి వారున్నారు. వీరు అటూ ఇటూ మారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు.
 
 
జనం మాట
అమ్మఒడి అందరికీ వరం

 అమ్మఒడి పథకం అందరికీ వరం. ఈ పథకం వల్ల ప్రతి పేదింట్లో పిల్లలు ధీమాగా పెద్ద చదువులు చదువుతారు. జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సంతకంతోనే మహిళల తలరాతలు మారతాయి.  అందుకే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సువర్ణయుగం సాధ్యపడుతుంది.                     - కాటి విశాలి,  గుడివాడ
 
పేదలకెంతో ప్రయోజనం
జగన్‌మోహన్‌రెడ్డి ఐదు సంతకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. అమ్మఒడి వల్ల పేదల పిల్లలు పనులు మాని బడికి వెళతారు. పింఛన్ల పెంపు వల్ల వృద్ధులకు, వికలాంగులకు ఆసరా లభిస్తుంది. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.       
  - దిరిశం బాలకోటయ్య, దిరిశంవాని దళితవాడ (ఘంటసాల)

 24 గంటల్లో కార్డు.. చాలా గ్రేట్
‘ఊరూరా జనసేవా కేంద్రాలు’ ఆలోచన అద్భుతం. వీటి ద్వారా 24 గంటల్లో రేషన్ కార్డు, పింఛన్లు లాంటివి మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. పేదలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామాల్లోనే ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఈ బాధ తప్పుతుంది.
 - శీరం సురేష్, పెడన
 
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు
వైఎస్ హయాం నాటి సువర్ణయుగాన్ని తెస్తానని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన సీఎం అయితేనే నా లాంటి యువత జీవి తాల్లో వెలుగులు నిండుతాయి. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలను వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరచటం ఆనందంగా ఉంది.
 - కొసనం రవితేజ, మచిలీపట్నం
 
 వైఎస్ పాలనలో ఈ కష్టాల్లేవ్!
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చాలా బాగుండేది. ప్రజలకు ఏ కష్టాలూ లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో ‘గ్యాస్’ కష్టాలను ఏ రోజూ చూడలేదు. సిలిండర్లు కచ్చితంగా ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా చూశారు. పెంచిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడు లేడు. గ్యాస్ కష్టాలు మామూలై పోయాయి. ఆధార్‌కార్డు, బ్యాంకు లింకేజీ అంటూ లేనిపోని నిబంధనలు పెట్టారు. గ్యాస్ కొనలేకపోతున్నాం. మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకోవాల్సి వస్తోంది.                 - శేషమ్మ,పెదయాదర, బందరు మండలం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement