సర్కారుకు గండి
- ఎన్నికల వేళ ఆబ్కారీ ఆదాయానికి బొక్క
- రెండు నెలల్లో రూ.20 కోట్లపైనే నష్టం
- ఈసీ నిబంధనలే కారణమని ఆగ్రహం
- అయినా ఆగని ‘మహా’ మద్యం ప్రవాహం
- అక్రమార్కులకు కాసులు కురిపించిన ఎన్నికలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎన్నికలు అంటే గుర్తొచ్చేది డబ్బు, మద్యం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు డబ్బు వెదజల్లడం, మద్యం పంపిణీ చేయడం సాధారణం. దీంతో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమైనా.. అక్రమార్కులు అడ్డ‘దారు’ల్లో మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమంగా డంప్ చేశారు. సాధారణంగా ఎన్నికల సమయం ఆబ్కారీ శాఖకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. అయితే ఈసారి మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు జరిగినా రెండు నెలల కాలంలో దాదాపు రూ.20 కోట్లకుపైగా ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఈసీ నిబంధనతో ఆదాయం కోల్పోయినా.. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిదేనని అధికారులు పేర్కొంటున్నారు.
ఈసీ నిబంధన తంటా..
మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6,11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లా పరిషత్, మండల పరిషత్, ఏప్రిల్ 30న శాసనసభ, లోకసభ ఎన్నికలు జరిగాయి. గతేడాది ఎంత మద్యం అమ్మకాలు జరిగాయో ఎన్నికల వేళ ఆ నెలలో అంతే మద్యం అమ్మకాలు జరగాలని, అప్పుడు ఎంత మద్యం సరఫరా చేశారో ఇప్పుడు కూడా అంతే ఇవ్వాలని ఈసీ నిబంధన విధించింది. ఇదీ ఆబ్కారీ శాఖకు ప్రతిబంధకంగా మారింది. 2013 ఏప్రిల్‌లో ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) 87,917 కేసులు, బీర్‌లు 1,40,347 కేసులు విక్రయాలు జరిగాయి. దీని ద్వారా అబ్కారీ శాఖకు రూ.41.92 కోట్లు ఆదాయం సమకూరింది. ఈసారి 2014 ఏప్రిల్ నెలలో ఐఎంఎల్ కేవలం 59,996 కేసులు, బీర్‌లు 87,848 కేసులు అమ్ముడు పోయాయి. కేవలం రూ.31.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే దాదాపు రూ.10 కోట్ల మేర ఆబ్కారీ శాఖకు నష్టం వచ్చింది. ఎన్నికల వేళ కావడంతో మద్యం సరఫరా పెంచి ఇచ్చేదుంటే ఇంకో రూ.10 కోట్ల ఆమ్మకాలు పెరిగేవి. మద్యం వ్యాపారులు కోరినప్పటికీ డిపోలు మద్యం సరఫరా చేయలేదు. దీంతో జిల్లాలో రోజు సుమారు 30 షాపుల వరకు సరుకు లేక మూతబడ్డాయి. జిల్లాలో ప్రతి నెల లక్ష ఐఎంఎల్ కేసులు, లక్ష బీర్‌ల కేసులు విక్రయాలు జరుగుతాయి. తద్వారా రూ.45 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఆదాయంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నీరుగారాయి.
అక్రమ మద్యం
ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం అమ్మకాలపై ప్రతిబంధకాలు ఉండగా మరోపక్క వ్యాపారులు అక్రమ మార్గంలో తమ దందా కొనసాగించారు. జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటం, సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్, యావత్‌మాల్, చంద్రపూర్, గడ్చిరోలి పరిధిలోని బోకర్, కిన్వట్, కేళాపూర్, పాండ్రకౌడ, రాజుర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఆనుకొని జిల్లాలో 20 మండలాలు సరిహద్దున ఉన్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలు మూసిఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
అయితే ఈసారి సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ ఈ నిబంధనలను పెట్టడంతో సరిహద్దు నుంచి దేశీదారు, చీప్‌లిక్కర్ తరలిద్దామనుకున్న వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి.అయితే ఈ విషయంలో అభ్యర్థులు ముందు జాగ్రత్త పడి ముందుగానే మద్యం నిల్వలను సమకూర్చుకున్నారు. చివరి రెండ్రోజుల్లో జోరుగా దేశీదారు, చీప్‌లిక్కర్ పంపిణీ జరిగింది. కాగా ఈ రెండు నెలల కాలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 57లక్షల మద్యంను పోలీసులు పట్టుకోవడం జరిగింది.