శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మిము వీడని నీడము మేమే.. అంటూ ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. డేగకన్ను నిఘాతో ఖర్చుల పద్దు రూపొందిస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అభ్యర్థులు వినియోగిస్తున్న కాన్వాయ్ మొదలుకొని.. ప్రచారంలో ఎక్కడెక్కడ తిరిగేది.. ఖర్చు చేస్తున్న మొత్తాన్ని వ్యయ పరిశీలకులు గుట్టుగా లెక్కిస్తున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు ఇప్పటికే సుమారు రూ.20 లక్షలు అయినట్లు ఎన్నికల వ్యయ పరిశీలకులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ నాయకులు, కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. భోజన ఖర్చులు అభ్యర్థుల ఖాతాలోకి రాకుండా రకాల రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఎన్నికల వ్యయ పరిశీలకుల డేగకన్ను నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తమ తోడుగా ప్రచారానికి వస్తున్న నాయకుల వాహనాల ఖర్చు కూడా వారి ఖాతాల్లో జమ అవుతున్నట్లు జాగ్రత్తలు వహిస్తున్నారు.
నాయకులు వారి కార్లను సుమారు రెండు, మూడు కిలో మీటర్ల దూరం నిలిపి అభ్యర్థుల వెంట ప్రచారానికి కదులుతున్నారు. ఇటీవల ఓ పార్టీ పార్లమెంట్, ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తల సమావేశాన్ని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేశారు. ఓ చోటా నాయకుడి జన్మదినం ఉందంటూ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు ఫంక్షన్‌హాలుకు కొద్ది దూరంలో భోజన సదుపాయం కల్పించారు. ఈ భోజనాల వద్దకు అభ్యర్థులు రావడంతో అక్కడ చేసిన ఖర్చులో సగం ఎమ్మెల్యే అభ్యర్థి ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది.
ఆర్భాటాలకు దూరంగా..
ఎన్నికల వ్యయ పరిశీలకుల నుంచి తప్పించుకోలేక అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కులాలు, వర్గాల వారికి గ్రూపులతో సమావేశం ఏర్పాటు చేసుకుని, వారికి కావాల్సినవి సమకూర్చుకుంటూ గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అవి ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టికి రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
వ్యయంపై నిఘా!
Published Wed, Apr 23 2014 11:30 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement