- లెక్కింపునకు 14 టేబుళ్ల ఏర్పాటు
- వేర్వేరుగా పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
- చివరగా భూపాలపల్లి ఫలితం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో స్థల సమస్య ఉన్నట్లయితే మరో గదిలో లెక్కించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే ఒకే హాల్‌లో వేర్వేరు టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
ఒక నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఈవీఎంలు (కంట్రోల్ యూనిట్) టేబుల్‌కు ఒకటి చొప్పున లెక్కిస్తారు. అలా నియోజకవర్గం లెక్కింపు పూర్తయ్యేసరికి ఒక టేబుల్‌పై ఎన్ని ఈవీఎంలు లెక్కిస్తారో అన్ని రౌండ్ల లెక్కింపు జరిపినట్లు లెక్క. ఉదాహరణకు.. జనగామ అసెంబ్లీ పరిధిలో మొత్తం 267 ఈవీఎంలు ఉన్నాయి. 14 టేబుల్స్‌కు ఒక్కో టేబుల్‌కు 20 ఈవీఎంల చొప్పున లెక్కకు వస్తాయి.
చివరి రౌండ్ వరకు మొదటి టేబుల్‌పై ఒక ఈవీఎంను మాత్రమే లెక్కిస్తారు. అంటే జనగామ లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో పూర్తవుతుందన్న మాట. కాగా, జిల్లాలోనే అత్యధిక ఈవీఎంలను భూపాలపల్లిలో వాడారు. ఇక్కడ మొత్తం 289 ఈవీఎంలలో ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ 21 రౌండ్ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ ఈవీఎంలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాడారు.
ఇక్కడ కేవలం 213 మాత్రమే ఉన్నాయి. దీంతో ఫలితం 16 రౌండ్లకే తెలుస్తుందన్న మాట. అంటే.. వరంగల్ తూర్పు లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లోపు వచ్చే అవకాశం ఉంది. అధికారులు అంతా అనుకున్నట్లు పనిచేస్తే ఎక్కువ రౌండ్లున్న భూపాలపల్లి ఫలితం చివరగా వెలువడొచ్చు. లేదంటే లెక్కింపు సందర్భంగా ఈవీఎంలు మొరాయిస్తే మరింత ఆలస్యం కావచ్చు. అయితే నియోజకవర్గాల వారీగా లెక్కింపు రౌండ్లను ఓసారి పరిశీలిస్తే..