
ముస్లిం సైనికుల వల్లే గెలిచాం
కార్గిల్ యుద్ధంపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
నోటీసు జారీచేసిన ఎన్నికల కమిషన్
తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించిన ఖాన్
న్యూఢిల్లీ/ఘజియాబాద్: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై బుధవారం పెను దుమారం రేగింది. ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత గెలుపునకు ముస్లిం సైనికులే కారణమని మంగళవారం ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యు) సహా పలు పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆజం వ్యాఖ్యలు సైనికుల సాహసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.
మతపరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. సైన్యాన్ని మతపరంగా విభజించడం తగదని, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడం ఈసీ పరిధిలోని అంశమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించింది. సమాజంలో ఓ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అనుభవించే బాధను ఖాన్ చెప్పాలనుకున్నారని పేర్కొంది. మరోవైపు తన వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగినప్పటికీ, ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని, వాటిపై ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు.
ఆజంఖాన్‌కు ఈసీ నోటీసు...
ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 11వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.