వచ్చేసారికి 15
- పెరగనున్న మూడు అసెంబ్లీ స్థానాలు
- 2019 ఎన్నికల్లోపు కొత్తవి ఏర్పాటు
- ఆశల్లో ద్వితీయ శ్రేణి నేతలు
- మారనున్న రాజకీయ ముఖచిత్రం
లోక్‌సభ నియోజకవర్గాల పరిధి కాకుండా... జిల్లాను యూనిట్‌గా తీసుకుని పునర్విభజన ప్రక్రియ చేపడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే జరిగితే గతంలో నియోజకవర్గాలు ఉన్న చేర్యాల మళ్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడే అవకాశం ఉండనుంది. తొర్రూరు, హసన్‌పర్తి, కేసముద్రం, నెక్కొండ వంటి జనాభా ఎక్కువగా ఉండే మండల కేంద్రాలను కొత్త నియోజకవర్గాల కేంద్రాలుగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండనుంది.
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులోనే ‘కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి’ అని పేర్కొనబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెట్టనుంది. వచ్చే ఎన్నికల్లోగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి.
గతంలో పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పార్లమెంట్ నిర్ణయం ప్రకారం సాధారణంగా ప్రతి 20 లేదా 30 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1978, 2009 ఎన్నికలకు ముందు పునర్విభజన చేశారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 153కు పెరగనుంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియలో భాగం గా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొత్తగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తగ్గించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. మన జిల్లాలో కొత్తగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పడే ఆస్కారముంది.
జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈ సెగ్మెంట్ పరిధిలో అదనంగా రెండు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు అదనంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ పేరుతో ఈ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మరో నియోజకవర్గం ఏ మండలం కేంద్రంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాలుగా ఉన్న హసన్‌పర్తి, ధర్మసాగర్, శాయంపేట పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో మన జిల్లాలోని నాలుగు, ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మన జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రస్తుత పరిధిని తగ్గించి మిగిలిన భాగంతో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటు కానుంది. దీన్ని ఏ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త స్థానాలపై కోటి ఆశలు
మొత్తంగా జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏ మండల కేంద్రంగా ఉంటాయి... అక్కడి రిజర్వేషన్ పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ముందుగా జరిగితే... నియోజకవర్గాల పునర్విభజన అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరగనుంది. ఇన్నాళ్లు మండల స్థాయిలో ఇప్పటికే పదవులు అనుభవించిన వారి దృష్టి ఇప్పుడు నియోజకవర్గాలపై పడింది. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నాయకులు సైతం... కొత్తగా ఏర్పడే నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందా అనే విషయంపై ఆలోచిస్తున్నారు.