బీజేపీ వరంగల్, ఖమ్మం స్థానాలపై రాని స్పష్టత
మిగతా 15 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
వరంగల్ అరూరి రమేశ్‌కు ఖాయమంటున్న పార్టీ వర్గాలు
ఖమ్మం టికెట్ కోసం ఓ బీఆర్‌ఎస్ ఎంపీ సహా పలువురి ప్రయత్నాలు
పరిశీలనలో జలగం వెంకటరావు పేరు
నల్లగొండ అభ్యర్థి ఖరారైనా ప్రయత్నాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
శానంపూడికి ఖాయమేనా?
నల్లగొండ సీటును బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు.
23న అభ్యర్థులతో కిషన్‌రెడ్డి సమావేశం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment