
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటుంది.. జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని.. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు.. కేపాసిటీ బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
