బస్సుకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు
బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న యాత్ర
అధినేతకు హారతులు పట్టనున్న మహిళలు
యాత్రలో 100 వాహనాలు..200 మంది వలంటీర్లు
ఎక్కడికక్కడ శ్రేణులు స్వాగతం పలికేలా ఏర్పాట్లు
తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. ఈ ప్రగతి రథానికి బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు.
మధ్యాహ్న భోజనం తర్వాత...
భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట ఉంటారు. సుమారు వందకు పైగా వాహనాలు ప్రగతి రథాన్ని అనుసరించే అవకాశముంది. సుమారు రెండు వందల మందితో కూడిన వలంటీర్ల బృందం కూడా యాత్రలో పాల్గొంటుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలతో పాటు సుదీర్ఘకాలంగా పారీ్టలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించనున్నారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం
తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్‌బీనగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది.
సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్‌వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కిలోమీటర్ మేర రోడ్ షో ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు.
రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్ విలేకరులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment