కేంద్రంలో సంకీర్ణం.. బీఆర్‌ఎస్‌ కీలకం: కేసీఆర్‌ | BRS Leader KCR Comments in Khammam bus Yatra | Sakshi
Sakshi News home page

కేంద్రంలో సంకీర్ణం.. బీఆర్‌ఎస్‌ కీలకం: కేసీఆర్‌

Published Tue, Apr 30 2024 5:22 AM | Last Updated on Tue, Apr 30 2024 5:22 AM

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో  స్థానికులతో ముచ్చటిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో స్థానికులతో ముచ్చటిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

ఖమ్మం బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

బీజేపీకి 400, 370 కాదు.. 200 సీట్లు కూడా దాటవు 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ 12 సీట్లు గెలవబోతోంది 

మోదీ గోదావరిని ఎత్తుకుపోతమంటే కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడ్తలేరు?.. నేనైతే నా తల తెగినా ఇందుకు ఒప్పుకోనని చెప్పిన 

మా ప్రభుత్వంలో వరి కోతలు.. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలు.. కరెంట్‌ పోతోందంటుంటే భట్టి విక్రమార్క వట్టి విక్రమార్కలా మాట్లాడుతున్నడు 

మళ్లీ విజృంభిద్దామని, అభివృద్ధి చేసుకుందామని పిలుపు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  ‘కేంద్రంలో బీజేపీ గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి 400, 370 సీట్లు ఏమీ వస్తలేవు. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని యావత్‌ ప్రపంచం కోడై కూస్తోంది. రాష్ట్రంలో ఇవ్వాళ ఆరో రోజు యాత్ర చేశా. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 12 పార్లమెంట్‌ సీట్లు బీఆర్‌ఎస్‌ గెలవబోతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ కీలకంగా మారనుంది. మీరు నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే సంకీర్ణంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. 

నరేంద్రమోదీ దాడి నుంచి, చేతకాని, చేవలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా.. కృష్ణాను రక్షించుకోవాలన్నా.. మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా.. హక్కులు సాధించుకోవాలన్నా. బీఆర్‌ఎస్‌ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతుంది..’అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్‌ బస్సుయాత్ర సోమవారం వరంగల్‌ నుంచి తిరుమలాయపాలెం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ సెంటర్‌లో కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

బీజేపీ వాళ్లకి తెలంగాణ సమస్యలు పట్టవు 
‘తెలంగాణలో పంటలు పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి తీసుకెళ్లాం. 3.50 కోట్ల టన్నుల వడ్లు పండించాం. కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొనమని మొండికేసింది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో నాడు ఎంపీలు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి ధాన్యం కొనమని అడిగారు. యాసంగిలో కొంచెం నూక అవుతుందని మంత్రికి చెప్పారు. అయితే ఆ మెదడు తక్కువ మంత్రి.. మీ తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అని చెప్పారు. దీనిని నిరసిస్తూ మొత్తం తెలంగాణ కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్‌ ఎంపీ కానీ నోరు కూడా తెరవలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ సమస్యలు వారికి పట్టవు..’అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. 

ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? 
‘గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లు ఇస్తామని మోదీ క్లియర్‌గా చెబుతుండు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నడు. ముగ్గురు ఎంపీలున్నరు. బీజేపీ ఉంది. వీళ్లేం చేస్తున్నరు. ఒక్కరైనా మాట్లాడుతున్నరా? రాష్ట్రాన్ని ఎండగడతామని మోదీ మాట్లాడుతుంటే వీరికి ఉలుకు, పలుకు లేదు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో కూడా మోదీ ఇదే ప్రతిపాదన తెచ్చారు. కానీ మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాక ..మా వాటా మాకు అక్కడ పెట్టేదాక ఎట్టి పరిస్థితుల్లో, నా తల తెగినా ఒప్పుకోనని చెప్పినా.. అది బీఆర్‌ఎస్‌ పార్టీ పాలసీ.. వీళ్లకు ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కేంద్ర మంత్రులు కావాలి.. కానీ తెలంగాణ సమస్యలు, ప్రధానమైన సమస్యలు నీళ్లు, రైతులు, పంటలు వీళ్లకు పట్టదు..’అని కేసీఆర్‌ విమర్శించారు.  

రేవంత్‌ నోటికి మొక్కాలి 
‘మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆయన నోటికి మొక్కాలి.. వెనకట కూడా కాంగ్రెస్‌ వాళ్లు చెప్పేది.. దున్నేవాడికే భూమి.. తినేవాడికే విస్తరి.. గీసేవాడికే గుండు.. అమ్మను చూడు ఆవుదూడ బొమ్మను చూడు.. గుద్దో గుద్దు అని. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్‌టీ రామారావు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టెడు అన్నం దొరికింది ఆ పుణ్యాత్ముడు చేపట్టిన కిలో రూ.2 బియ్యం ద్వారానే. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది చరిత్ర..’అని బీఆర్‌ఎస్‌ అధినేత వివరించారు.  

తులం బంగారం తుస్సుమంది 
‘తెలంగాణ రావడంతో ఎన్‌టీఆర్‌ చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు ఇలా అన్నీ చేసుకున్నాం. కుంట భూమి ఉన్నా రైతు చనిపోతే వారం లోపు వారి ఇంటికి రూ.5 లక్షలు పంపాం. కల్యాణలక్ష్మి, పెట్టుకున్నాం. అయితే రూ.లక్ష మాత్రమే ఇస్తున్నారు..నేను తులం బంగారం ఇస్తానని రేవంత్‌రెడ్డి అన్నడు.. తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్‌ కస్సుమంటోంది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటోంది. 

తొమ్మిదేళ్లు రెప్పపాటు పోకుండా ఉన్న కరెంట్‌ నాలుగు నెలల్లో మాయమైపోతదా? నిన్న మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంట్‌ పోయింది. కరెంట్‌ పోయిందని నేను ట్విట్టర్‌లో పెట్టా. ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వట్టి విక్రమార్క. కరెంట్‌ పోయిందంటే కేసీఆర్‌ అబద్ధాలకోరు అంటున్నడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత ఉంది.. కరెంటు కోతలు ఉన్నాయి. హాస్టళ్లు మూసేస్తున్నామని చీఫ్‌ వార్డెన్‌ నోటీసు ఇచ్చింది వాస్తవం కాదా? బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వరి కోతలుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ కోతలున్నాయి..’అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.  

ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి 
‘రూ.2 లక్షల రుణమాఫీ అని రేవంత్‌రెడ్డి అన్నడు. డిసెంబర్‌ 9 నాడు మాఫీ చేస్తానన్నడు. అయ్యిందా? భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు అంటావు.. ఇలా ప్రజలను మోసం చేయడానికి ఎన్ని ఒట్లు పెడతావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి. ప్రతి మహిళకు రూ.2500 వచ్చిందా? వచ్చే ఆశ ఉందా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతోంది. 

ఈ మోసాలపై శాసనసభలో, బయట సభల్లో బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తే కేసీఆర్‌ నీ గుడ్లు పీకుతా, పండపెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైల్లో వేస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషా ఇది?. పార్లమెంట్‌ ఎన్నికలైన తెల్లారే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంప్‌ కొడతాడని బీజేపీ వాళ్లే చెబుతున్నరు. ఈ మాటలను ఆయన ఒక్కసారి కూడా ఖండించడం లేదు. రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత భయంకరమైన రాజకీయ అనిశ్చితి రానుంది..’అని బీఆర్‌ఎస్‌ అధినేత వ్యాఖ్యానించారు.  

నాడు ఖమ్మం బ్రహ్మరథం పట్టింది 
‘నేను ఒక్కడిని బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు తెలంగాణ వస్తదని. నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్‌ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆనాడు ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూడెమోక్రసీ, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు, తెలంగాణ వాదులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు పలికారు. అది నేను మర్చిపోలేదు. చివరికి తెలంగాణ వచ్చింది. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభివృద్ధిని చేసి చూపించిండు. నగరంలో నాడు రోజూ మంచినీళ్లు వస్తే.. ఇప్పుడు మూడురోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయి. 

తమ భూములకు నీళ్లు కావాలని పాలేరు రైతులు తూములు బద్ధలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంటలు ఎండిపోతుంటే నీటి మంత్రి, వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నరు? అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసింది. ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. మీ కోరికలు నెరవేరాలంటే బీఆర్‌ఎస్‌కు శక్తి కావాలి. రాష్ట్రాన్ని, ఖమ్మంను ముందుకు తీసుకెళ్లే బలం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగింది. మళ్లీ విజృంభిద్దాం.. అభివృద్ధి చేసుకుందాం..’అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

బస్సు యాత్రలో ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, బానోతు మదన్‌లాల్, మెచ్చా నాగేశ్వరరావు, దేశపతి శ్రీనివాస్, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. 

మళ్లీ మీరే రావాలె సారు 
– కేసీఆర్‌తో రైతులు, వృద్ధులు, మహిళలు 
– ఖమ్మం మార్గంలో చాయ్‌ హోటల్‌ వద్ద బస్సు యాత్రకు బ్రేక్‌ 
మరిపెడ రూరల్‌:  ‘మీరు లేకపోవుడుతోటి ఇన్ని కష్టాలు సారు. కాంగ్రెస్‌ వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయినం.. ఇట్‌లైతదని అనుకోలే సారు .. మళ్లా మీరే రావాలె సారు..’అంటూ పలువురు రైతులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, తాను అండగా ఉంటానని చెబుతూ వారిని ఓదార్చారు. 

బస్సుయాత్రలో భాగంగా హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్‌ మార్గం మధ్యలోని మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న చిన్న చాయ్‌ హోటల్‌ వద్ద కాసేపు ఆగారు. కేసీఆర్‌ను చూసి హోటల్‌ యజమాని సొందు, కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హోటల్‌లో ఉన్న మిర్చి బజ్జి, పకోడి, గారెలను ఆయనకు అందించారు. వాటిని తిన్న కేసీఆర్‌ వారితో కాసేపు ముచ్చటించారు. సమాచారం అందుకున్న ఆనెపురం మాజీ సర్పంచ్‌ లాల్‌సింగ్‌ తదితరులు ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరుకున్నారు. 

కొందరు రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, యాసంగికి సాగు నీళ్లు అందక పొలాలు ఎండిపోయాయని, కరెంట్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రైతుబంధు సహా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని కేసీఆర్‌ వారికి భరోసా ఇచ్చారు. కాగా పలువురు యువతీ యువకులు కేసీఆర్‌తో సెల్ఫీలు దిగారు. మరిపెడ మండల కేంద్రంలో బస్సుయాత్రకు డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement