16 రోజులపాటు 13 లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం
చివరి రోజు సిరిసిల్ల, సిద్దిపేటలో రోడ్ షోలతో ముగింపు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలే టార్గెట్
రోడ్ షోలతో పలు సెగ్మెంట్లలో కేసీఆర్, హరీశ్‌రావు ప్రచారం
8 నుంచి 12 సీట్లలో గెలుస్తామనే ధీమాలో బీఆర్‌ఎస్
నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం ముగిసింది. గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజులపాటు 13 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల మినహా రాష్ట్రంలోని మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. మెదక్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టిపెట్టేలా ఆయన రోడ్ షోలు జరిగాయి.
ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చివరి రోజు శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్... సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలలో పాల్గొని ప్రచారాన్ని ముగించారు. చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముగించాలని భావించారు. అయితే వర్ష సూచన నేపథ్యంలో సిద్దిపేటలోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఓవైపు బస్సు యాత్ర ముగియడం, మరోవైపు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈసీ కొరడాతో 48 గంటలపాటు ప్రచారానికి దూరం..
బస్సు యాత్ర ఎనిమిదో రోజు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5న సిరిసిల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3న రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రచార షెడ్యూల్‌లో కొద్దిపాటి సవరణలు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలపై వాక్బాణాలు
పక్షం రోజులకుపైగా సాగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ భాష, పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రధానిగా మోదీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలో కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రచారంలో విశ్రమించని కేటీఆర్, హరీశ్
బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. అలాగే హరీశ్‌రావు మెదక్, జహీరాబాద్, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా, బస్సు యాత్రకు భారీగా జనం తరలివచ్చారని, బీఆర్‌ఎస్ పట్ల ఓటరు సానుకూలతకు ఇది సంకేతమని పార్టీ భావిస్తోంది. కనీసం 8 నుంచి 12 సీట్లలో విజయం సాధిస్తామనే ధీమా బీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment