ఈ నెల 15 తర్వాత ఎన్నికల ప్రచారానికి కేసీఆర్
తొలుత సభలు నిర్వహించాలనుకున్నా వైఎస్ జగన్ తరహాలో బస్సు యాత్రకే మొగ్గు!
అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌పై కసరత్తు
కనీసం వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ మీటింగ్‌లు లక్ష్యంగా టూర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని తొలుత భావించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 97 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
కానీ తాజాగా బహిరంగ సభలకు బదులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బస్సు యాత్ర దోహద పడుతుందని భావిస్తున్నారు. వేసవి తీవ్రతలో జన సమీకరణ కష్టతరమవుతుందనే ఉద్దేశంతో బస్సు యాత్ర చేస్తేనే మంచిదనే అభిప్రాయానికి ఇప్పటికే కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది.
మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్ర తీరుతెన్నులను పరిశీలించిన కేసీఆర్ ఇక్కడ కూడా అదే రీతిలో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ద్వారా సుమారు వంద అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మీటింగులు లక్ష్యంగా, వీలైనన్ని మండలాలను కవర్ చేసేలా ప్రచారానికి రూట్ మ్యాప్, షెడ్యూలుపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రతికూలాంశాలపైనా చర్చ
నాలుగు నెలల క్రితం ప్రమాదానికి గురైన కేసీఆర్ ఇంకా ఊతకర్ర సాయంతోనే నడుస్తుండటంతో బస్సు యాత్ర ఎంతవరకు సాధ్యమనే చర్చా జరిగినట్టు తెలిసింది. మరోవైపు ఇటీవల ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ చేసిన ‘పొలంబాట’సందర్భంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తోపులాటకు దిగుతుండటంతో వారిని నియంత్రించడం కష్టతరమవుతోందని సెక్యూరిటీ విభాగం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం.
13న చేవెళ్లలో బహిరంగ సభ
కేసీఆర్ బస్సు యాత్రకు ముందు, గతంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, ముఖ్య నేతలతో జరుగుతున్న సన్నాహక, సమన్వయ భేటీల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన ప్రచారం, ఎజెండా తదితరాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment