ఈ నెల 6వ తేదీన జరగనున్న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెర పడనుంది.
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఈ నెల 6వ తేదీన జరగనున్న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెర పడనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి గత నెల 17న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 24వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. 25వ తేదీ నుంచే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ప్రచారపర్వం హోరెత్తించారు.
జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి కర్నూలు, నంద్యాల డివిజన్లలోని అభ్యర్థులంతా ఈ నెల 4న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాల్సి ఉంది. మలి విడత పోలింగ్ 11వ తేదీన జరగనున్న దృష్ట్యా ఆదోని డివిజన్‌లోని అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునే వీలుంది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: జెడ్పీ సీఈఓ
ఎన్నికల కమిషన్ నిబంధనలను అభ్యర్థులందరు పాటించాలని, ధిక్కరిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అదనపు అధికారి, జెడ్పీ సీఈఓ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 4వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు జరగరాదన్నారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, కల్యాణమండపాలు, ఇతరత్రా బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహించినా, చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.