స్థానిక పోరుకు గట్టి బందోబస్తు
కర్నూలు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో శుక్రవారంతో ముగియనుంది.
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలకు 196 మంది 786 ఎంపీటీసీ స్థానాలకు 2210 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొదటి విడత 6వ తేదీ కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలో కర్నూలు, కోడుమూరు, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం పోలింగ్ జరుగనుంది. అలాగే రెండో విడత 11వ తేదీ ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు సబ్‌డివిజన్ స్థాయి అధికారులు స్థానిక పోలీసు అధికారులతో భద్రతపై సమీక్షించారు. 6వ తేదీన జరగనున్న తొలి విడత ప్రాదేశిక పోరుకు పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇతర జిల్లాల నుంచి ఎన్నికల బందోబస్తుకు పోలీసులను రప్పించే అవకాశం లేకపోవడంతో రిటైర్డ్ పోలీసు అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ రఘురామిరెడ్డి నిర్ణయించారు. అలాగే పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సిబ్బందితో పాటు ఎన్సీసీ కేడెట్ల సేవలను కూడా ప్రాదేశిక పోరులో బందోబస్తు విధులకు వినియోగించుకోనున్నారు. అలాగే సీఐడీ, ఏసీబీ, ఇతర లూప్‌లైన్ విభాగాల్లో పని చేస్తున్న వివిధ హోదాల్లో ఉన్న అధికారుల సేవలను కూడా వినియోగించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు.
జిల్లాలో ఉన్న సిబ్బందితో పాటు ఏపీఎస్పీ బలగాలు ఇప్పటికే ఎన్నికల బందోబస్తులో నిమగ్నమయ్యారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిబ్బంది అక్కడ బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. అలాగే ఈనెల 9వ తేదీన నిర్వహించాల్సిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో మునిసిపల్ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో 219 సమస్యాత్మక గ్రామాలు, 182 అత్యంత సమస్యాత్మక గ్రామాలను పోలీస్‌శాఖ గుర్తించింది.
అందుకు తగ్గ ఏర్పాట్లలో భాగంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సిద్ధం చేశారు. మునిసిపల్‌ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన వివాదాలు, ఘర్షణలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల వేళ గ్రామాల్లో ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే బెయిల్‌కు సైతం వీలు లేని కేసులు పెట్టే విధంగా ఎస్పీ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలింగ్ రోజు అల్లర్లకు ఆస్కారం లేకుండా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రిటైర్డ్ రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహించాలనే ఆసక్తి ఉన్న ఆర్మీ, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎక్సైజ్ తదితర విభాగాల్లో పని చేసి రిటైర్డ్ అయిన సిబ్బంది తమ పేర్లను సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోగా పేరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నందున ఈనెల 5, 6 తేదిల్లో మొదటి విడత, 10, 11 తేదిల్లో రెండవ విడత ప్రాదేశిక ఎన్నికల బందోబస్తులో పాల్గొనాలనుకునే వారు డీఎస్పీ కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రాదేశిక ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించిన వారికి గౌరవ వేతనం ఇచ్చేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది.