సాక్షి, ముంబై: పెయిడ్ న్యూస్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు చుక్కెదురైంది. తనపై ఎన్నికల కమిషన్ ప్రారంభించిన దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా కోరుతూ చవాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చవాన్‌కు అనుకూలంగా అనేక వార్తలు వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో చవాన్ ఎన్నికల ఖర్చు పరిమితి దాటిందని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి మాధవ్ కిన్వల్కర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఎన్నికల కమిషన్ దర్యాప్తు అధికారులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తును నిలిపివేయాలని అశోక్ చవాన్ ముందుగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా అదే తీర్పు పునరావృతం కావడం, ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వార్తపత్రికల్లో ఇచ్చే ప్రకటనల ఖర్చులు చూపించనట్టయితే ఎన్నికల కమిషన్‌కు దర్యాప్తు చేసేందుకు పూర్తి అధికారాలున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో చవాన్ దర్యాప్తును ఎదుర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది.
పెయిడ్ న్యూస్ కేసులో అశోక్‌చవాన్‌కు చుక్కెదురు
Published Mon, May 5 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement