సాక్షి, ముంబై: జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా సమీకరణాలు మారనున్నట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరుతుండవచ్చనే వదంతులు వస్తున్నాయి. దీంతో ఆయన అసంతృప్తిని తొలగించేందుకు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న నానా పటోలేను తొలగించి ఆ స్ధానంలో అశోక్ చవాన్‌ను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే నానా పటోలేకు మొండిచేయి, పీసీసీ అధ్యక్ష పదవి అశోక్ చవాన్‌కు దక్కడం ఖాయమని స్పష్టమవుతోంది. శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ శిందే దేవేంద్ర ఫడ్నవీస్‌తో జతకట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తులందరు శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారు. అందులో అశోక్ చవాన్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గణేశోత్సవాల సమయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా అశోక్ చవాన్ భేటీ అయ్యారు. దీంతో కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో వాస్తవముందని పలువురు నేతలు గుర్తించారు. దీంతో ఆయన పార్టీ మారక ముందే అసంతృప్తిని తొలగించి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
ఇదిలాఉండగా చవాన్ బీజేపీలో చేరకుండా నిరోధించాలన్నా, శాశ్వతంగా పార్టీలో కొనసాగాలన్నా, లేదా పార్టీని బలోపేతం చేయాలన్నా ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ కోణంలో సీనియర్ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముంబైలోని తిలక్ భవన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రదేశ్ ప్రతినిధుల సమావేశానికి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హెచ్.కె.పాటిల్, ప్రదేశ్ ఎన్నికల అధికారి పల్లం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు, పదాధికారులు ఫిర్యాదులు చేశారు. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన్ని మార్చే అధికారం కాంగ్రెస్ అధ్యక్షునికి అప్పగించారు. దీంతో నానా పటోలేను మార్చాలని అప్పుడు ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. కానీ సమయం కోసం వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అశోక్ చవాన్ అసంతృప్తి వ్యవహారం బయటపడింది. ఆయన బీజేపీలో చేరనున్నట్లు వదంతులు రావడంతో దీన్ని అదనుగా చేసుకుని పటోలేను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అశోక్ చవాన్‌ను నియమించాలనే అంశం తెరమీదకు వచ్చింది. పీసీసీతోపాటు ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) అధ్యక్ష పదవి నుంచి భాయి జగ్తాప్‌ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. జగ్తాప్ పనితీరుపై కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారు. త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ముంబైలో ఓ పట్టిష్టమైన నాయకత్వం కావాలి. దీంతో జగ్తాప్‌ను కూడా ఆ పదవి నుంచి తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్ధానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కానీ ఈ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై అందరు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment