సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా? ఢిల్లీ నుంచి వెలువడుతున్న సంకేతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆదర్శ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్‌కు బాంబే హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పు కొంతమేర ఊరటనిచ్చింది. చవాన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్‌పై కోర్టు స్టే విధించింది.
కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా వారిని ముందు విచారించాలని కోర్టు సీబీఐకి సూచించడంతో ప్రస్తుతానికి చవాన్‌కు ముప్పు తప్పినట్లేనని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రచార బాధ్యలను చవాన్‌కు అప్పగించాలని భావిస్తున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చవాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా అసంతృప్తులను తృప్తి పర్చొచ్చనే అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన నేతగానే కాకుండా మాస్ లీడర్‌గా కూడా చవాన్ మంచి పేరుందని, ఆయనకు బాధ్యతలు అప్పగిస్తేనే ఎన్నికల్లో గట్టెక్కుతామనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందంటున్నారు. ముఖ్యమంత్రిని మార్చాలనే సందర్భంలో కూడా అధిష్టానం అశోక్‌చవాన్ పేరును పరిశీలించిందని, అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నందున తీర్పు వెలువడే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్న అధిష్టానం సీఎం మార్పు విషయంలో పృథ్వీరాజ్‌ను కొనసాగించాలని నిర్ణయించిందని, దీంతో అశోక్ చవాన్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు.
పైగా చవాన్‌కు బాధ్యలు అప్పగించడం ద్వారా రాణే వంటి నాయకులకు కూడా చెక్ పెట్టినట్లవుతుందంటున్నారు. ఎందుకంటే సీఎంతోపాటు మాణిక్‌రావ్‌పై కూడా రాణే విమర్శలు చేశారు. అయితే రాణే, అశోక్‌చవాన్ జోలికి వెళ్లలేదు. వీరిద్దరి మధ్య కొంతమేర సత్సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో అశోక్‌చవాన్‌కు బాధ్యలు అప్పగిస్తే రాణే వంటి నాయకుల నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని చెబుతున్నారు.
ఎన్సీపీ ఆగడాలకూ అడ్డుకట్ట..
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థానాల్లో విజయం సాధించాలంటే మాస్‌బేస్ నాయకుడి అవసరం ఉందని భావిస్తోంది. మాస్‌లో మంచి పేరున్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడిగా అశోక్‌చవాన్‌కే పేరు దక్కింది. ఎన్సీపీలో అజిత్‌పవార్ వంటి మాస్ నేతలకు చెక్ పెట్టాలంటే అంతటి దూకుడును ప్రదర్శించే నేతకు ఎన్నికల ప్రచార బాధ్యలు అప్పగించాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వినిపిస్తుండడంతో అశోక్‌చవాన్ పాత్ర కీలకమైంది.
కొత్త చిక్కులు..
ఆదర్శ్ సోసైటీ కుంభకోణం కేసులో చవాన్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. చవాన్‌ను విచారించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన కేతన్ తిరోదార్ తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. సొసైటీలో అక్రమంగా ఫ్లాట్లు పొందిన మరో నలుగురు పెద్దమనుషుల పేర్లను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. తిరోదార్ పేర్కొన్న ఆ నలుగురు చవాన్‌కు సన్నిహితులే కావడం ఆయనకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రచార పగ్గాలు..అశోకుడికే?
Published Fri, Aug 8 2014 10:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement