ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
18 ఏళ్ల లోపు వారు కూడా..
మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్‌లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడు చేసిన ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)ఓటుహక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వ్యతిరేకించిన బీఎన్‌పీ
2024 ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనానంతరం తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా యూనస్ నియమితులయ్యారు. ఆయన తాజాగా బంగ్లాదేశ్‌లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్‌పీ తీవ్రంగా వ్యతిరేకించింది.
కొత్త ఓటరు జాబితా కోసం..
ఢాకాలోని జాతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో బీఎన్‌పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దీనివలన మరింత సమయం వృధా అవుతుందని, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అలంగీర్ పేర్కొన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆరోపించారు.
రాజకీయ పార్టీలతో చర్చ జరగాలి
దేశ అధ్యక్షుడు ఓటింగ్‌కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సివస్తుంది. అలాకాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌కే వదిలేసి ఉంటే బాగుండేది. అప్పుడు సరైన నిర్ణయం వెలువడేది. ప్రస్తుతం దేశంలో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదిస్తే సరిపోయేది. అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చ జరిగేదని ఆలంగీర్ అన్నారు. కాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షడు యూనస్ డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్థం మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయిని అన్నారు. ఓటరు జాబితాను సవరించాక ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు
Comments
Please login to add a commentAdd a comment