బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్
హైదరాబాద్: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 235 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రానుందని స్పష్టమవుతోందని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అవినీతి, కుంభకోణాలు, అస్తవ్యస్త పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో గతంలోకంటే 10 నుంచి 15 శాతం వరకు ఎక్కువగా నమోదైందని, అది బీజేపీకి లాభపడిందని తమ విశ్లేషణలో తేటతెల్లమైందని జవదేకర్ పేర్కొన్నారు.
తమ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సామాజిక వర్గం, చాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చిన తీరును కించపరిచేలా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు తమకు వరంగా మారాయని తెలిపారు. అట్టడుగు వర్గాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆగ్రహంగా ఉన్నాయని, వారంతా మోడీని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్ర లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందన్నారు. సీమాంధ్రతో టీడీపీతో కలిసి అధికారంలోకి వస్తామని, తెలంగాణలో అనూహ్య ఫలితాలు సాధిస్తామని అన్నారు. మోడీ ప్రధాని అయితేనే ఈ రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇక కేసీఆర్ చెబుతున్న మూడో కూటమికి మనుగడే ఉండదని, అయినా... తెలంగాణను వ్యతిరేకించిన వారితో ఉండే ఆ కూటమిలో కలుస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ఎలా అంటారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 85 సీట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 15 సంఖ్య దాటదని, అదే 18 సీట్లు పొందిన బీజేపీ ఇప్పుడు 58 వరకు సీట్లు సాధించే అవకాశం ఉందని అన్నారు.
పోలింగ్ జరిగిన చోట్ల బీజేపీదే ఆధిక్యం
Published Tue, Apr 22 2014 1:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement