prakash java dekar
-
ఇక దేశవ్యాప్తంగా బడిబాట
న్యూఢిల్లీః స్కూల్ వైపు చూడని చిన్నారులను బడిబాట పట్టించేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ‘స్కూల్ చలో అభియాన్’ కార్యక్రమం చేపట్టనున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా బడికి దూరంగా ఉన్న 80 లక్షల మంది విద్యార్థులను స్కూళ్లలో చేర్పిస్తామని చెప్పారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓ సెమినార్లో మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం లభించినప్పుడు దేశంలో కేవలం 18 శాతంగా ఉన్న అక్షరాస్యత ప్రస్తుతం 81 శాతానికి పెరిగిందన్నారు.అక్షరాస్యతా శాతాన్ని మరింతగా పెంచాలని, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ 70 కోట్ల మొబైల్ ఫోన్లు ఉండటంతో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ఇదే సరైన సమయమన్నారు. -
2 రాష్ట్రాలూ కేంద్రానికి రెండు కళ్లు
విద్యుత్ కొరత పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రకాశ్ జవదేకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తొలుత విలేకరులతో, ఆ తర్వాత పట్టభద్రుల సమావేశంలో జవదేకర్ మాట్లాడారు. అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందనేది పట్టించుకోకుండా ప్రజల సమస్యలను, అభివృద్ధిని మాత్రమే చూస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కొరతను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. విశాఖ పవర్ ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఉందని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలను పంపిన వెంటనే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయనున్న 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని జవదేకర్ వివరించారు. పట్టభద్రులంతా సమాజహితాన్ని కాంక్షించాలని ఆయన సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలపక్షాన పోరాడనున్న బీజేపీ అభ్యర్థి ఎన్.రామచందర్రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో ఉంటూ తెలంగాణను వ్యతిరేకించినవారే టీఆర్ఎస్ మంత్రివర్గంలో క్రియాశీలకంగా ఉన్నారని విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వం దారి తప్పుతున్నప్పుడు మేధావుల మౌనం మంచిదికాదని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీడీపీ నేత ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు జవదేకర్
బాబు ప్రమాణ స్వీకారం తర్వాత నిర్మలా సీతారామన్ పేరు ప్రకటన న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభకు పంపనున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి జవదేకర్, కర్ణాటక నుంచి ప్రభాకర్ కోరేలను పెద్దల సభకు పంపనుంది. కేంద్ర మంత్రి జవదేకర్ ప్రస్తుతానికి ఉభయసభల్లో దేనిలోనూ సభ్యుడిగా లేరు. మహారాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జవదేకర్ పదవీ కాలపరిమితి ఏప్రిల్ 2తో ముగిసింది. అప్పటి నుంచి లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని జవదేకర్‌కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం దక్కిన విషయం విదితమే. దీంతో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఈ నెల 19న జరగనుంది. కాగా లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన ఉంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీతారామన్ పేరును నామినేట్ చేయాలని బీజేపీ యోచిస్తోంది. -
‘ప్రతిపక్ష నేత’పై 4లోగా నిర్ణయం
కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ కొలువుదీరే జూన్ 4లోగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా మంజూరు అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిబంధనలు పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిం దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మం త్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వచ్చే 4లోగా ఈ అంశాన్ని పరిష్కరిస్తామని అన్నారు. మంత్రిగా పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎగువసభ (రాజ్యసభ)కు సంబంధించిన వ్యవహారాలను జవదేకర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అప్పగించారు. రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడం, అక్కడ తమ యుద్ధాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. పెద్దల సభలో శాసనపరమైన ఎజెండా ఆమోదం పొందడం కష్టమవుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై సమాధానమిచ్చారు. తగిన సంఖ్యా బలం ఉన్నందున కాంగ్రెస్‌కు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కడంలో ఎలాం టి సమస్యా లేనప్పటికీ.. లోక్‌సభకు సంబంధించి మాత్రం అవసరమైన 55 సీట్లకు గాను ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే లభించడంతో ఈ అంశం ప్రశ్నార్ధకమైంది. ప్రతిపక్ష నేత హోదా కింద ప్రయోజనాలు దక్కాలంటే చట్టపరమైన కొన్ని అవసరతలు ఉండా ల్సి ఉన్నప్పటికీ.. ఏకైక అతిపెద్ద పార్టీ నేతకు లేదా గ్రూపునకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టాలని స్పీకర్ భావించినట్టైతే అందుకు న్యాయపరమైన ఆటంకం ఏమీ లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా పార్టీ తరఫునుంచి ఎవరు ఉండాలనేదానిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. -
పోలింగ్ జరిగిన చోట్ల బీజేపీదే ఆధిక్యం
బీజేపీ తెలంగాణ ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 235 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రానుందని స్పష్టమవుతోందని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అవినీతి, కుంభకోణాలు, అస్తవ్యస్త పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో గతంలోకంటే 10 నుంచి 15 శాతం వరకు ఎక్కువగా నమోదైందని, అది బీజేపీకి లాభపడిందని తమ విశ్లేషణలో తేటతెల్లమైందని జవదేకర్ పేర్కొన్నారు. తమ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సామాజిక వర్గం, చాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చిన తీరును కించపరిచేలా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు తమకు వరంగా మారాయని తెలిపారు. అట్టడుగు వర్గాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆగ్రహంగా ఉన్నాయని, వారంతా మోడీని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్ర లో కూడా బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందన్నారు. సీమాంధ్రతో టీడీపీతో కలిసి అధికారంలోకి వస్తామని, తెలంగాణలో అనూహ్య ఫలితాలు సాధిస్తామని అన్నారు. మోడీ ప్రధాని అయితేనే ఈ రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇక కేసీఆర్ చెబుతున్న మూడో కూటమికి మనుగడే ఉండదని, అయినా... తెలంగాణను వ్యతిరేకించిన వారితో ఉండే ఆ కూటమిలో కలుస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఎలా అంటారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 85 సీట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 15 సంఖ్య దాటదని, అదే 18 సీట్లు పొందిన బీజేపీ ఇప్పుడు 58 వరకు సీట్లు సాధించే అవకాశం ఉందని అన్నారు. -
ప్రధాని మాటను దాసరి విన్లేదు
బీజేపీ అధికార ప్రతినిధి జవదేకర్ సోనియా చెప్పినట్లే ప్రధాని చేశారు బొగ్గు గనుల కేటాయింపు పక్కా క్విడ్‌ప్రోకో హైదరాబాద్: ‘దాసరి నారాయణరావు. శిబూ సోరెన్‌లు కేంద్ర మంత్రులుగా ఉండగా ప్రధాని మన్మోహన్సింగ్ మాట వినేవారు కాదు. అంతా టెన్ జన్‌పథ్ చెప్పినట్టు చేసేవారు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల కాదా? చరిత్రలో ఇలాంటి దారుణం గతంలో చూశామా. బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారమంతా టెన్ జన్‌పథ్ సూచనల మేరకు జరగలేదా? ఆయా బ్లాకులు ఎవరికి కేటాయించాలో రాసి ఉన్న చిట్టీలు వచ్చేవి. వాటి ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఆ చిట్టీలు ఎక్కడి నుంచి వచ్చేవో సోనియా, ప్రధాని సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ రాసిన పుస్తకంలో బొగ్గు కుంభకోణం, ప్రధాని వ్యవహార శైలి తదితరాల ప్రస్తావన నేపథ్యంలో ఆయన సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మన్మోహన్‌ను రబ్బర్ స్టాంపుగా తయారు చేసి సోనియా చక్రం తిప్పారని, ఈ క్రమంలోనే లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం చోటుచేసుకుందన్నారు. క్విడ్‌ప్రోకో ప్రకారం జరిగిన ఈ వ్యవహారంలో సీబీఐ డొల్లతనం ప్రదర్శించిందని విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి పరేఖ్ నివేదికలను నాటి మంత్రి దాసరి నారాయణరావు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలిసి కూడా ప్రధాని మౌనంగా ఉండటానికి కారణం తెలియాల్సిన అవసరముందన్నారు. ఇంత జరిగినా సోనియా ఎందుకు నోరువిప్పటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం.. సోనియా, మన్మోహన్‌ల వ్యవహారాన్ని బయటపెట్టగా, పరేఖ్ పుస్తకం మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ వద్ద సమాధానాలు లేకే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఆర్థిక తోడ్పాటుతోనే ఈ పుస్తకాలు వెలువడ్డాయని బుకాయించి తన నైజాన్ని బయటపెట్టుకుందని జవదేకర్ విమర్శించారు. అభిమానం గల వ్యక్తిత్వం ఉండి ఉంటే మన్మోహన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. టీడీపీతో సమన్వయం బాగుంది రాష్ట్రంలో మిత్రపక్షం టీడీపీతో తమకు మంచి సమన్వయం ఉందని జవదేకర్ తెలిపారు. ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి సాగుతున్నారని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణల్లో కలిపి 25 వరకు ఎంపీ సీట్లను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈసారి మూడు సీట్లకే పరిమితమవుతుందన్నారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
దటీజ్ జవదేకర్
టెన్షన్లోనూ బేఫికర్.. గౌరీభట్ల నరసింహమూర్తి: బీజేపీ రాష్ట్ర కార్యాలయం... ఆవరణంతా కార్యకర్తలతో నిండి ఉంది... వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.. అసహనంతో దుందుడుకు చర్యలకు సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది.. ఇంతలో లోపలి నుంచి కాషాయ రంగు కుర్తా ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చారు.. కార్యకర్తల నినాదాలు ఇంకా మిన్నంటాయి. ఆ వ్యక్తిని చుట్టుముట్టి.. ‘‘మా నియోజకవర్గం బీజేపీకే దక్కాలి... అక్కడ మా అభ్యర్థిని గెలిపించి తీరుతాం... టీడీపీకి కేటాయిస్తే ఓటమి తప్పదు... మా అన్నకు జై’’ అంటూ ఘెరావ్ చేశారు. ఆయనపై దాడి చేస్తారేమో అన్నంత ఉద్రిక్తత నెలకొంది. కానీ ఆ వ్యక్తి మోములో చిరునవ్వు చెరగలేదు.. ఆవేశంగా నినాదాలిస్తూ ముందుకు దూసుకొస్తున్న ఓ నేత వద్దకు వెళ్లి... చేయి పట్టుకుని పెకైత్తి ‘‘భారతీయ జనతా పార్టీకో జితాయేంగే... నరేంద్ర భాయ్ మోడీకో ప్రధాన్‌మంత్రి బనాయేంగే’’ అంటూ గట్టిగా నినదించారు. అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న ఆవరణలో ఒక్కసారి నిశ్శబ్దం! ఆ వెంటనే మోడీ నినాదాల హోరు. అదే చిరునవ్వుతో ఆ వ్యక్తి అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రకాశ్ జవదేకర్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి. చేతల మనిషి.. ప్రకాశ్ జవదేకర్.. పక్కా మరాఠీ. కానీ మాటల మరాఠీ కాదు.. చేతల మనిషి. సమయస్ఫూర్తి కలిగిన నేత. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలను విజయవంతంగా నడపగలిగే కొద్ది మంది పార్టీ నేతల్లో ముఖ్యుడు. తాజాగా రాష్ట్రంలో బీజేపీ-తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఇటు సొంత పార్టీ, అటు టీడీపీ నేతల ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణలో బీజేపీ అండ లేకుండా దాదాపు ఒక్క స్థానం కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితిలో లేని టీడీపీ... కమలం పంచన చేరేందుకు ఆరు నెలలుగా పావులు కదుపుతోంది. మోడీ ఊపు... తెలంగాణ సాకారంతో ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో బలపడ్డ బీజేపీతో పొత్తుకు ఉబలాటపడింది. పొత్తు కుదిరినా బీజేపీకి 30కి మించి ఎక్కువ స్థానాలు ఇవ్వద్దని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు... బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా అనుకున్నది సాధించాలనుకున్నారు. కానీ చర్చలకు బీజేపీ తరపున జవదేకర్ పాల్గొనటంతో బాబు ఆటలు సాగలేదు. బీజేపీ తెలంగాణ నేతలు చివరకు ఎన్ని సీట్లు చెప్పారో.. బాబు మెడలు వంచి అన్ని సీట్లు సాధించగలిగారు. 47 అసెంబ్లీ స్థానాలు బీజేపీ దక్కటంతో టీడీపీ నేతలు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అది జవదేకర్ వ్యవహార శైలి. ఒక దశలో టీడీపీ అధినేత సీట్ల విషయంలో మొండికేయటంతో జవదేకర్ ఒకటి కాదు రెండు కాదు... ఆరు పర్యాయాలు ఆ పార్టీ నేతలతో భేటీ కావాల్సి వచ్చింది. బాబు బృందం ఆయనను విసిగించే ప్రయత్నం చేసింది. తుది చర్చల రోజైతే.. ఉదయం పది గంటలకు మొదలైన భేటీ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ఏకబిగిన 17 గంటల పాటు చర్చోపచర్చలు సాగినా... జవదేకర్లో అసహనం, ఆగ్రహం, విసుగు ఛాయలు లేకపోగా... బాబు బృందమే పట్టు సడలించాల్సి వచ్చింది. జవదేకర్‌తో పడలేకపోయిన బాబు అంతకుముందు ఢిల్లీకి వెళ్లి తన మిత్రుడు, బీజేపీ అగ్రనేత అరుణ్‌జైట్లీతో భేటీ అయి తక్కువ స్థానాలకే బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బాబుకు అనుకూలంగా స్పందించిన జైట్లీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిషన్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కానీ జవదేకర్ ఎంట్రీతో సీను రివర్స్ అయి బాబు డంగైపోక తప్పలేదు! -
ఢిల్లీ యాత్ర విజయవంతం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ బాధితుల పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతమైందని జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి నాయకులు ఎంతో మంది తమకు ఆందోళనకు మద్దతు ప్రకటించారన్నారు. పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జవదేకర్, వివేక్, ఆనంద్‌భాస్కర్, హన్మంతరావులు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు జరుగుతున్న హక్కుల ఉల్లంఘన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. కానీ, జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడూ అటు తిరిగైనా చూడలేదని, పైగా జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కడుందని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీసం పౌష్టికాహారం, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ మండలానికి ఒక్కంటికి *200 కోట్లు అందిస్తే.. వాటిని ఫ్లోరైడ్ నివారణకు ఖర్చు చేయకుండా రాజకీయ నాయకులు పంచుకున్నారని విమర్శించారు. జలసాధన సమితి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం గురించి యావత్ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని తెలి పారు. రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అంజయ్య, దుబ్బ కొండమ్మ, అలుగుబెల్లి భిక్షారెడ్డి, మారం హేమచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.