దటీజ్ జవదేకర్
టెన్షన్‌లోనూ బేఫికర్.. గౌరీభట్ల నరసింహమూర్తి: బీజేపీ రాష్ట్ర కార్యాలయం... ఆవరణంతా కార్యకర్తలతో నిండి ఉంది... వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.. అసహనంతో దుందుడుకు చర్యలకు సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది.. ఇంతలో లోపలి నుంచి కాషాయ రంగు కుర్తా ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చారు.. కార్యకర్తల నినాదాలు ఇంకా మిన్నంటాయి. ఆ వ్యక్తిని చుట్టుముట్టి.. ‘‘మా నియోజకవర్గం బీజేపీకే దక్కాలి... అక్కడ మా అభ్యర్థిని గెలిపించి తీరుతాం... టీడీపీకి కేటాయిస్తే ఓటమి తప్పదు... మా అన్నకు జై’’ అంటూ ఘెరావ్ చేశారు.
ఆయనపై దాడి చేస్తారేమో అన్నంత ఉద్రిక్తత నెలకొంది. కానీ ఆ వ్యక్తి మోములో చిరునవ్వు చెరగలేదు.. ఆవేశంగా నినాదాలిస్తూ ముందుకు దూసుకొస్తున్న ఓ నేత వద్దకు వెళ్లి... చేయి పట్టుకుని పెకైత్తి ‘‘భారతీయ జనతా పార్టీకో జితాయేంగే... నరేంద్ర భాయ్ మోడీకో ప్రధాన్‌మంత్రి బనాయేంగే’’ అంటూ గట్టిగా నినదించారు. అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న ఆవరణలో ఒక్కసారి నిశ్శబ్దం! ఆ వెంటనే మోడీ నినాదాల హోరు. అదే చిరునవ్వుతో ఆ వ్యక్తి అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రకాశ్ జవదేకర్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి.
చేతల మనిషి..
ప్రకాశ్ జవదేకర్.. పక్కా మరాఠీ. కానీ మాటల మరాఠీ కాదు.. చేతల మనిషి. సమయస్ఫూర్తి కలిగిన నేత. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలను విజయవంతంగా నడపగలిగే కొద్ది మంది పార్టీ నేతల్లో ముఖ్యుడు. తాజాగా రాష్ట్రంలో బీజేపీ-తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఇటు సొంత పార్టీ, అటు టీడీపీ నేతల ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణలో బీజేపీ అండ లేకుండా దాదాపు ఒక్క స్థానం కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితిలో లేని టీడీపీ... కమలం పంచన చేరేందుకు ఆరు నెలలుగా పావులు కదుపుతోంది. మోడీ ఊపు... తెలంగాణ సాకారంతో ప్రజల్లో పెరిగిన విశ్వాసంతో బలపడ్డ బీజేపీతో పొత్తుకు ఉబలాటపడింది. పొత్తు కుదిరినా బీజేపీకి 30కి మించి ఎక్కువ స్థానాలు ఇవ్వద్దని గట్టిగా నిర్ణయించుకున్న చంద్రబాబు... బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా అనుకున్నది సాధించాలనుకున్నారు. కానీ చర్చలకు బీజేపీ తరపున జవదేకర్ పాల్గొనటంతో బాబు ఆటలు సాగలేదు. బీజేపీ తెలంగాణ నేతలు చివరకు ఎన్ని సీట్లు చెప్పారో.. బాబు మెడలు వంచి అన్ని సీట్లు సాధించగలిగారు. 47 అసెంబ్లీ స్థానాలు బీజేపీ దక్కటంతో టీడీపీ నేతలు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అది జవదేకర్ వ్యవహార శైలి. ఒక దశలో టీడీపీ అధినేత సీట్ల విషయంలో మొండికేయటంతో జవదేకర్ ఒకటి కాదు రెండు కాదు... ఆరు పర్యాయాలు ఆ పార్టీ నేతలతో భేటీ కావాల్సి వచ్చింది. బాబు బృందం ఆయనను విసిగించే ప్రయత్నం చేసింది. తుది చర్చల రోజైతే.. ఉదయం పది గంటలకు మొదలైన భేటీ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది.
ఏకబిగిన 17 గంటల పాటు చర్చోపచర్చలు సాగినా... జవదేకర్‌లో అసహనం, ఆగ్రహం, విసుగు ఛాయలు లేకపోగా... బాబు బృందమే పట్టు సడలించాల్సి వచ్చింది. జవదేకర్‌తో పడలేకపోయిన బాబు అంతకుముందు ఢిల్లీకి వెళ్లి తన మిత్రుడు, బీజేపీ అగ్రనేత అరుణ్‌జైట్లీతో భేటీ అయి తక్కువ స్థానాలకే బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బాబుకు అనుకూలంగా స్పందించిన జైట్లీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిషన్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కానీ జవదేకర్ ఎంట్రీతో సీను రివర్స్ అయి బాబు డంగైపోక తప్పలేదు!