మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు జవదేకర్
బాబు ప్రమాణ స్వీకారం తర్వాత నిర్మలా సీతారామన్ పేరు ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభకు పంపనున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి జవదేకర్, కర్ణాటక నుంచి ప్రభాకర్ కోరేలను పెద్దల సభకు పంపనుంది. కేంద్ర మంత్రి జవదేకర్ ప్రస్తుతానికి ఉభయసభల్లో దేనిలోనూ సభ్యుడిగా లేరు. మహారాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జవదేకర్ పదవీ కాలపరిమితి ఏప్రిల్ 2తో ముగిసింది. అప్పటి నుంచి లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని జవదేకర్‌కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో స్థానం దక్కిన విషయం విదితమే.
దీంతో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఈ నెల 19న జరగనుంది. కాగా లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన ఉంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీతారామన్ పేరును నామినేట్ చేయాలని బీజేపీ యోచిస్తోంది.