2 రాష్ట్రాలూ కేంద్రానికి రెండు కళ్లు
విద్యుత్ కొరత పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రకాశ్ జవదేకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తొలుత విలేకరులతో, ఆ తర్వాత పట్టభద్రుల సమావేశంలో జవదేకర్ మాట్లాడారు. అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందనేది పట్టించుకోకుండా ప్రజల సమస్యలను, అభివృద్ధిని మాత్రమే చూస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కొరతను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు.
విశాఖ పవర్ ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఉందని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలను పంపిన వెంటనే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయనున్న 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని జవదేకర్ వివరించారు. పట్టభద్రులంతా సమాజహితాన్ని కాంక్షించాలని ఆయన సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలపక్షాన పోరాడనున్న బీజేపీ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో ఉంటూ తెలంగాణను వ్యతిరేకించినవారే టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో క్రియాశీలకంగా ఉన్నారని విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వం దారి తప్పుతున్నప్పుడు మేధావుల మౌనం మంచిదికాదని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీడీపీ నేత ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.