ఆసక్తికరంగా జార్ఖండ్ అసెంబ్లీ పోరు
జేఎంఎం కంచుకోటలుగా కొల్హన్, సంథాల్
నార్త్ చోటానాగపూర్, పాలముల్లో బీజేపీ హవా
సౌత్ చోటానాగపూర్‌లో ఇరు కూటముల కొట్లాట
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.
హేమంత్ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.
ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్ చోటానాగపూర్‌తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్ చోటానాగపూర్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి.
సంథాల్ పరగణా
అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి.
లోక్‌సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి.
కొల్హాన్
ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్ చోటానాగ్‌పూర్‌లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్ సోరెన్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది.
పాలము
ఇటు బిహార్, అటు ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది.
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది.
నార్త్ చోటానాగ్‌పూర్
25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది.
సౌత్ చోటానాగ్‌పూర్
ఛత్తీస్‌గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే సాగింది.
67 శాతం రెడ్ అలర్ట్ స్థానాలే!
174 మందిపై కేసులు
235 మంది కోటీశ్వరులు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో బుధవారం తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.
వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment