సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుద లైంది. ప్రస్తుతం రాజకీయ అస్పష్టత నేపథ్యంలో నాయకుల్లో ఇప్పటికే టెన్షన్ నెల కొంది
సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుద లైంది. ప్రస్తుతం రాజకీయ అస్పష్టత నేపథ్యంలో నాయకుల్లో ఇప్పటికే టెన్షన్ నెల కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య అవగాహనలు, పొత్తుల వంటి కారణాలతో పోటీ చేసే నాయకులు గందరగోళంలో ఉన్నారు.
వీటన్నింటికీ తోడు నియోజకవర్గాల వారీగా జరిగిన ఓటర్ల జాబి తాల్లో మార్పులు-చేర్పులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నారుు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ఎంత... ఎవరెవరు ఎటు వేశారు.. వంటి అంశాలు, జయాపజయాల తీరును బేరీజు వేసుకునే ఎవరైనా ముందుకెళుతారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్నమార్పులు ఆయూ నియోజకవర్గాల్లోని అభ్యర్థులను
అయోమయంలోకి నెట్టారుు.
నూతన ఓటర్లదే ప్రభావం...
2009 సాధారణ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నేతల చతురతతోపాటు రాజకీయ పొత్తులతో అవకాశాలు కోల్పోయిన వారు పోటీకి దిగడం వంటి కారణాలతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారి మెజార్టీ తక్కువగానే ఉంది. 2009లో కొత్తగా ఓటు హక్కు పొందిన వారే గెలుపోటములను ప్రభావితం చేశారు. ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపైనే అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
వారి మనసులో ఏముందో...
2009లో జిల్లావ్యాప్తంగా మొత్తం 24,46, 551 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత జాబి తా ప్రకారం 24,96,622 మంది ఓట ర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోల్చి తే జిల్లాలో కొత్తగా ఓటు హక్కు పొందిన వా రు 50,071 మంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో వీరి తీర్పే కీలకంగా మారనున్నట్లు స్పష్టమవుతోంది. తమతమ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటు వేసే వారి మనసులో ఏముంది... వారి మెప్పు పొందడం ఎలా అనే పనిలో నేతలు నిమగ్నమయ్యూరు. గత ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిన వారు వీరి ఆదరణ విషయంలో ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు.
ఎనిమిది సెగ్మెంట్లలో పెరిగింది...
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. వరంగల్ పశ్చిమలో 2009లో గెలిచిన దాస్యం వినయ్‌భాస్కర్‌కు 6,684 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటి ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గంలో 17,791 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. మెజార్టీకి మూడు రెట్లుగా ఉన్న ఈ ఓటర్లతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉండనుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి, డోర్నకల్, పాలకుర్తి సెగ్మెంట్లలో పెరిగిన ఓటర్ల సంఖ్యను గమనిస్తే... ఇలాంటి పరిణామాలే దారితీయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నాలుగు చోట్ల తగ్గింది...
వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, జనగామ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈ అంశమే అక్కడ పోటీ చేయనున్న నాయకుల్లో ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామలో 2009తో పోల్చితే ప్రస్తుతం 2,331 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 236 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇప్పుడు తగ్గిన ఓటర్లు... గత ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించిన వారై ఉంటారనేది మంత్రితోపాటు ఆయన ప్రత్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. వరంగల్ తూర్పు సెగ్మెంట్‌లో మరో మంత్రి బస్వరాజు సారయ్యకు 2009 ఎన్నికల్లో 7,255 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో 15,191 ఓట్లు తగ్గాయి. ఇలా తగ్గిన ఓట్లు మంత్రికి చేటు చేస్తాయా... ఆయన ప్రత్యర్థులకు లబ్ధి చేకూరుస్తాయూ... అనేది ఆసక్తికరంగా మారనుంది.