తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు.
రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చ్ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment