‘పుర’ పోరు ముగిసింది. ‘స్థానిక’ సమరం సాగుతోంది. ఇక జిల్లా యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల రంగానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వానికి గడువు సమీపిస్తుండడంతో అధికారులు అందుకు రెడీగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు తీవ్రస్థాయిలో చేస్తున్నాయి. వివిధ కోణాల్లో అంచనాలు వేసుకుంటూ జాబితాలు రూపొందించే పనిలో పడ్డాయి.
సార్వత్రిక సమరభేరికి రాజకీయ పక్షాలు సన్నద్దమయ్యాయి. రేపటి(బుధ వారం)నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సాధా రణ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. జిల్లా అధికారయంత్రాంగం అందుకు అనుగుణంగా సర్వసన్నద్దమైంది. జిల్లాలోని రెం డు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు సం భందించి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 2 నుంచి 9వ తేదిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 తేదిల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఎన్నికలు ఈనెల 30న జరుగనున్నాయి.
నామినేషన్ దాఖలిలా...
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఎం.గిరిజా శంకర్‌కు అందజేయాల్సి ఉంటుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల సహాయాధికారి అయిన జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్‌కు దాఖలు చేయవలసి ఉంటుంది. పార్లమెంట్‌కు పోటీచేయనున్న జనరల్ లేదా బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ..25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500లు చెల్లించవలసి ఉంటుంది. అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న జనరల్, బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఖర్చు...
పార్లమెంట్ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయకూడదు. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.28 లక్షల వరకే ఎన్నికల ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోటీచేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందురోజు ఎన్నికల ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. లావాదేవీలన్ని అదే అకౌంట్ ద్వారా నిర్వహించి ఎన్నికల అధికారులకు ఖర్చు లెక్కలు చూపాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు పొందుపర్చవలసిన అవసరం ఉంటుంది.
ఇక ‘సార్వత్రికం’
Published Tue, Apr 1 2014 2:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement