.ఉత్కంఠ!
సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడే 2వ తేదీ నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. 9వ తేదీ ఆఖరు తేదీ. ఎన్నికలు ముంగిట్లో నిలిచినా.. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక్క సీపీఎం మాత్రమే నల్లగొండ, భువనగిరి లోక్‌సభ, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు.
ఉగాది రోజునే తొలి జాబితా ప్రకటిస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కిరాని కారణంగా మరో మూడు నాలుగు రోజులు జాబితాల విడుదలను వాయిదా వేసుకుంది. దీంతో కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురు ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ పార్టీ సీపీఐతో పొత్తులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినా, అధికార ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులనూ ప్రకటించడం లేదు. పార్టీ వర్గాల సమాచారం మేరకు సీపీఐ మునుగోడు, దేవరకొండలను తీసుకుం టుంది. కాంగ్రెస్ మరో పదిచోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా, కోదాడ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఇంకా, తమ అభ్యర్థులను మాత్ర,అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆ పార్టీ నుంచి టికెట్లు ఖాయం అన్న ధీమాతో ఉన్న నాయకులు కొందరు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఒంటరి పోరుకు సిద్ధమంటున్న టీఆర్‌ఎస్ సైతం తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినా కుదరొచ్చన్న కారణంగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పోటీకి పెడుతున్నట్లు ప్రచారం జరిగినా, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సీపీఐతోనూ ఆ పార్టీ పొత్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారణంగానే జిల్లాలో టీఆర్‌ఎస్ పోటీ చేసే స్థానాల విషయంపై ఇంకా గందరగోళమే నడుస్తోంది.
టీడీపీ-బీజేపీల పరిస్థితి దీనికంటే భిన్నంగా ఏమీలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురిందని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమూ ఖరారైందంటున్నా.. ఇంకా అధికార ప్రకటన రాలేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం, టీడీపీ తరపున బరిలోకి దిగడానికి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉండడం వంటి కారణాలతో ఇరు పార్టీల కార్యకర్తలు టెన్షన్‌లోనే ఉన్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పంపకాలు జరిగినా, నాయకత్వాల నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడుతుందాని ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకున్న సీపీఐ మాత్రం తమ సిట్టింగ్ స్థానం మునుగోడు, చానాళ్ల పాటు తమ ప్రాతినిధ్యంలో ఉన్న దేవరకొండ సీట్ల నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈసారి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరిరావును పక్కన పెట్టి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న చర్చ సీపీఐలో జరుగుతోందని చెబుతున్నారు. నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కూడా మెజారిటీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించకుండా రాజకీయ విశ్లేషకులకు పనికల్పించాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.