175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల రణం ఊపందుకుంది. వచ్చే నెల 7న పోలింగ్ జరగనున్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా.. తొలి రోజే నామినేషన్ల పర్వం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకివే తొలి సార్వత్రిక ఎన్నికలు కాగా.. ఆ పార్టీ సీమాంధ్రలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలన్నింటికీ ఒకేసారి జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారమే ఆ జాబితా వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. జాబితా ప్రకటనకు ఒక్క రోజు ముందు ఆదివారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండు దఫాలుగా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా ప్రకటించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 87 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 15 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలను తీసేస్తే.. ఇంకా 73 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం, సీపీఐలు ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
జోరుగా ప్రచారం..
ఇప్పటికే ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన వైఎస్సార్ సీపీ అగ్ర ప్రచారకర్తలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిల రెండో దఫా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం గుంటూరు జిల్లాలో రెండో దఫా ప్రచారం ప్రారంభించగా.. అధ్యక్షుడు జగన్ సోమవారం జాబితా ప్రకటన అనంతరం కర్నూలు జిల్లా ప్రచారానికి బయల్దేరనున్నారు. షర్మిల ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
సీమాంధ్రతోపాటు ఆరు రాష్ట్రాలలోని స్థానాలకు నోటిఫికేషన్
ఎనిమిదో దశలో సీమాంధ్రతోపాటు ఎన్నికలు జరుగనున్న ఆరు రాష్ట్రాల్లోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ శనివారం నోటిఫికేషన్ వెలువడింది. మే 7న ఉత్తరప్రదేశ్‌లోని 15 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గం కూడా ఉంది. బీహార్‌లోని ఏడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు, జమ్మూ కాశ్మీర్‌లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు నియోజకవర్గాలకు అదే రోజు ఎన్నికలు జరుగుతాయి.
సీమాంధ్రలో సమరభేరి
Published Sun, Apr 13 2014 1:42 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement