Seemanadhra
-
తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్
అధికారులకు చంద్రబాబు ఆదేశం.. పలు అంశాలపై సమీక్ష హైదరాబాద్: ఆదాయ వనరులు, రుణ పరపతి పెంపు విషయంలో తెలంగాణ స్థాయికి సీమాంధ్రను తీసుకువెళ్లడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర విభజన, సీమాంధ్రలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. చంద్రబాబు మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. కొత్తగా విమానాశ్రయాలను ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు, రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఏవి? వీటి కోసం ఎంత మేర పెట్టుబడులు అవసరం అవుతాయో తెలియజేయూలన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై వారంలో నివేదికలు సమర్పిస్తామని నూతన ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు చెప్పారు. -
సీమాంధ్రలో సమరభేరి
175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల రణం ఊపందుకుంది. వచ్చే నెల 7న పోలింగ్ జరగనున్న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా.. తొలి రోజే నామినేషన్ల పర్వం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకివే తొలి సార్వత్రిక ఎన్నికలు కాగా.. ఆ పార్టీ సీమాంధ్రలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలన్నింటికీ ఒకేసారి జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారమే ఆ జాబితా వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. జాబితా ప్రకటనకు ఒక్క రోజు ముందు ఆదివారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండు దఫాలుగా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా ప్రకటించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 87 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 15 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలను తీసేస్తే.. ఇంకా 73 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం, సీపీఐలు ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జోరుగా ప్రచారం.. ఇప్పటికే ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన వైఎస్సార్ సీపీ అగ్ర ప్రచారకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిల రెండో దఫా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం గుంటూరు జిల్లాలో రెండో దఫా ప్రచారం ప్రారంభించగా.. అధ్యక్షుడు జగన్ సోమవారం జాబితా ప్రకటన అనంతరం కర్నూలు జిల్లా ప్రచారానికి బయల్దేరనున్నారు. షర్మిల ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీమాంధ్రతోపాటు ఆరు రాష్ట్రాలలోని స్థానాలకు నోటిఫికేషన్ ఎనిమిదో దశలో సీమాంధ్రతోపాటు ఎన్నికలు జరుగనున్న ఆరు రాష్ట్రాల్లోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ శనివారం నోటిఫికేషన్ వెలువడింది. మే 7న ఉత్తరప్రదేశ్‌లోని 15 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గం కూడా ఉంది. బీహార్‌లోని ఏడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు, జమ్మూ కాశ్మీర్లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఐదు, పశ్చిమ బెంగాల్లో ఆరు నియోజకవర్గాలకు అదే రోజు ఎన్నికలు జరుగుతాయి. -
సీమాంధ్రలో 5 సీట్లకేనా?
మోడీ హవా ఉంటే పరిమిత సీట్లకే పోటీ చేయడమేంటన్న మీడియా ప్రశ్నకు వెంకయ్యనాయుడు తటపటాయింపు ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నామని జవాబు హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీదే హవా అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇరకాట పరిస్థితి ఏర్పడింది. మోడీ హవా అంతగా ఉంటే సీమాంధ్రలో ఐదు లోక్‌సభ సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు ఆ పార్టీ నేతలు తడబడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుదీ ఇదే పరిస్థితి. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురవగా.. జవాబు చెప్పేందుకు ఆయన కాసేపు తటపటాయించారు. కొద్ది క్షణాల తరువాత ‘అలా నిర్ణయం తీసుకున్నాం’ అని బదులిచ్చారు. ‘‘మా పార్టీ నిర్ణయాలపై మీరు(మీడియా) ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చినప్పటికీ.. మా బలమేంటో ప్రజలే తీర్పిస్తారు’’ అని అంటూ.. సీమాంధ్రలో ఓట్లు చీలకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. బీజేపీ-టీడీపీల పొత్తుపై కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. గతంలో వారు పొత్తులు పెట్టుకున్నప్పడు ఒప్పయింది.. ఇప్పుడు తప్పెలా అవుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి కాకుండా ఇతరులకు ఓటు వేస్తే అస్థిరత్వానికి ఓటు వేసినట్టే అవుతుందని చెప్పారు. తాను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని.. అన్నిచోట్లా నరేంద్ర మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ లోక్‌సభకు మోడీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నార న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడుదశల పోలింగ్‌లో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు కూడా ఊహించని ఫలితాలొస్తాయని జోస్యం చెప్పారు. మోడీ ప్రభావంతోనే యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారన్నారు. మన్మోహన్సింగ్ ప్రధాని పదవిలో కొనసాగినా అధికారిక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలాయించారని ప్రధానికి సలహాదారునిగా పనిచేసినవారు రాసిన పుస్తకంపై ఆ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నా.. ఎన్నికల తర్వాత మళ్లీ అందర్నీ కూడగట్టి వెనుక నుంచి అధికారం చలాయించే ప్రమాదముందని హెచ్చరించారు. -
నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: నాడు కాంగ్రెస్ నాయకులను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వారినే తన పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ అడిగిన చంద్రబాబు నిత్యం కాంగ్రెస్ నాయకులను విమర్శించారన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం దరిని చంద్రబాబు దుమ్మెత్తి పోశారని, నేడు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ టీడీపీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతమవు తుందని చెప్పుకుంటున్నారన్నారు. బాబు రాజకీయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అంతేకాక సీమాంధ్రను అభివృద్ధి చేయగలిగిన శక్తిమంత నేత జగన్ అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్ అన్నారు.అందుకే ఆయనపై విశ్వాసంతో అన్ని ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలువబోతున్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తెగిన బంధం...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతాయని సాగునీటి శాఖ గుర్తించిన 205 గ్రామాల (134 రెవెన్యూ గ్రామాలు)తో పాటు మరో మూడు గ్రామాలు కలిపి మొత్తం 208 గ్రామాలను తెలంగాణ నుంచి మినహాయిస్తున్నట్లు మంగళవారం లోక్‌సభ ఆమోదించిన బిల్లులో పేర్కొన్నారు. పోలవరం కడితే మునిగిపోతాయని సాగునీటి శాఖ 2005 జూన్ 27న విడుదల చేసిన జీవోనెం.111లో గుర్తించిన 205 గ్రామాలతో పాటు బూర్గంపాడు మండల పరిధిలోకి వచ్చే సీతారాంనగరం, బూర్గం పాడు, కొండ్రెక గ్రామాలను సీమాంధ్రలో కలుపుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఇన్నాళ్లూ ముంపు ప్రాంతాలు కూడా తెలంగాణలోనే ఉంటాయనే జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆదివాసీ సంఘాలు, తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని కనుమరుగు చేయడంతో పాటు లక్షలాది ఎకరాల అటవీ భూములను గోదావరిలో ముంచొద్దని తాము చేస్తున్న పోరాటాలను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తాము ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరో 18 గ్రామాల పరిస్థితేంటి? అయితే, పోలవరం రికార్డుల్లో 205 గ్రామాలనే పేర్కొన్నా వాటితో పాటు మరో 18 గ్రామాలు ఖచ్చితంగా ముంపునకు గురవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం లేకపోయినా... కూనవరం మండలంలోని ముల్లూరు,భీమవరం, లేళ్లవాయి, లక్ష్మిపురం, కొండ్రాజ్పేట,కొత్తూరు ,శ్రీరాంపురం,చినార్కూరు, కరకగూడెం,పొట్లవాయిగూడెం,పైదిగూడెం,రేపాకకాలని,నర్సింగపేట, చింతూరు మండలంలోని నర్శింగపేట, వీఆర్‌పురం మండలంలోని చిరుగువాడ,భొవనగిరి,జల్లివారిగూడెం ,శబరిరాయిగూడెం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మరి, ఈ గ్రామాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న సర్వత్రా వస్తోంది. మండలాల్లో మార్పులేదు తొలుత పేర్కొన్న విధంగా జిల్లాలోని నాలుగు మండలాలు పూర్తిగా మునిగిపోతాయని, ఆ నాలుగు మండలాలు జిల్లా చిత్ర పటం నుంచి వెళ్లిపోతాయని అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాకు చెందిన ఏ ఒక్క మండలం కూడా పూర్తిగా ముంపునకు గురికావడం లేదు. అయితే, గ్రామం ఉంటే పొలాలు, పొలాలుంటే గ్రామా లు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలు యథాతథంగా ఉంటాయని, ముంపునకు పోను మిగిలిన గ్రామాలతో మండలాలు కొనసాగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నా... తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, జిల్లాలోని పంచాయతీలలో 208పంచాయతీలు తగ్గుతాయని భావిస్తున్నారు. జీవోనెం.111 ప్రకారం పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలివే..... భద్రాచలం మండలం...13 గ్రామాలు రాచగొంపల్లి, గౌరిదేవిపేట, నందిగామ, నందిగామపాడు, మురుమూరు, గొమ్ముమురుమురు, కాపవరం, టిపివీడు, గోగుబాక, గొమ్ముకొత్తగూడెం, గొమ్ముకోయగూడెం, గొల్లగూడెం, సీతాపురం కూనవరం మండలం.....48 గ్రామాలు చినపోలిపాక ,పెదపోలిపాక, గుండువారిగూడెం,పోచవరం,పోచవరం కాలనీ, కాచవరం,దూగుట్ట, కూళ్ళపాడు, టేకుబాక, వెంకటాయిపాలెం, కోట్లవాయి, గొమ్ముయ్యవారిగూడెం, పెదనర్సింగపేట,చిననర్సింగ పేట, కరకగూడెం, అయ్యవారిగూడెం,కొండాయిగూడెం,గొమ్ముగూడెం,కుమారస్వామిగూడెం,మర్రిగూడెం, పల్లూరు, జగ్గవరం, జగ్గవరం కాలని, చూచిరేవులగూడెం, చూచిరేవుల,కూనవరం, టేకులబోరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, జిన్నెలగూడెం,బండారుగూడెం,పెదార్కూరు,రేపాక,ముసురగూడెం, భగవాన్ పురం, ముల్లూరు, కూటూరు,అభిచర్ల,లింగాపురం,కొడేరు,తాళ్ళగూడెం,బొజ్జరాజుగూడెం, రేగులపాడు, రావిగూడెం, వెంకన్నగూడెం,పండ్రాజ్పల్లి, శబరికొత్తగూడెం,వాల్ఫర్డ్‌పేట. చింతూరు... 17 గ్రామాలు చింతూరు, చిడుమూరు, వీరాపురం, చట్టి, కుమ్మూరు, బండారుగూడెం, గొర్రెల గూడెం, మామిళ్లగూడెం, కల్లేరు, కుయిగూరు, చూటూ రు, ముకునూరు, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, జల్లివారిగూడెం, ఉలుమూరు, మల్లెతోట. వీఆర్‌పురం...45 గ్రామాలు చొప్పలి, రామవరం, రామవరంపాడు,సోములగూడెం,కొప్పల్లి, రావిగూడెం, బోరిగూడెం, అడవి వెంకన్నగూడెం,ప్రత్తిపాక,తుష్టివారిగూడెం, గుండుగూడెం,చింతవేవుపల్లి, కన్నాయగూడెం, సున్నంవారిగూడెం,నూతిగూడెం,మిట్టిగూడెం,ఉమ్మిడివరం,గుర్రంపేట,అన్నవరం, రేఖపల్లి, వడ్డిగూడెం,ధర్మతాళ్ళగూడెం, వీఆర్‌పురం,తోటపల్లి,రాజుపేట,రాజుపేటకాలని,సీతంపేట,శ్రీరామగిరి, చొక్కనపల్లి, కొత్తూరు,కల్తునూరు,జీడిగుప్ప,ఇసునూరు, రావిగూడెం, ములకపల్లి,ముత్యాలమ్మగండి, భీమవరం, ఇప్పూరు,కొత్తూరుగొమ్ము,పోచవరం, తుమ్మిలేరు,కొండేపూడి, కొల్లూరు,గొందూరు,నర్సింగపేట. బూర్గంపాడు మండలం: 9 గ్రామాలు శ్రీధర, వెలేరు, రాయిగూడెం, వెంకటాపురం, అల్లిగూడెం, బోనగిరి, గుంపెనపల్లి, ఇబ్రహీం పేట, గణపవరం, (ప్రస్తుతం లోక్‌సభ ఆమో దం పొందిన బిల్లు ప్రకారం ఇదే మండలంలోని సీతారాంనగరం, కొండెరక, బూర్గంపా డు గ్రామాలు కూడా ఈ జాబితాలో చేరతాయి.) కుక్కునూరు మండలం.. 34 గ్రామాలు తొండిపాక,మెట్టగుడెం,బంజరగుడెం,అమరవరం,కోమట్లగుడెం, ఉప్పేరు, కొయ్యగుడెం, రెడ్డిగుడెం, దామరచర్ల,ఎల్లప్పగుడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాధవరం, కౌడిన్యముక్తి, వింజరం, ముత్యాలమ్మపాడు, కొండపల్లి, కోయగుడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగుడెం, కుక్కునూరు, రామసింగారం, కిష్టారం, కుర్లపాడు, లంకాలపల్లి,ఇసుకపాడు, దాచవరం, బెస్తగుడెం, ఉప్పరమద్దిగట్ల, సీతారామచంద్రపురం, కొత్తూరు, గొమ్ముగుడెం. వేలేరుపాడు మండలం: 39 గ్రామాలు రుద్రమకోట, పాతపూచిరాల, పూచిరాలకాలనీ, లచ్చిగుడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగుడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపురం, జగన్నాధపురం, చాగరపల్లి, కొర్రాజులగుడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరంకాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, కట్కూరు, టేకూరు, కాచారం, కొయిదా, తాళ్ళగొంది, పూసుగొంది, టేకుపల్లి,పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, సిద్దారం, చింతలపాడు, పడమటిమెట్ట, బుర్రతోగు, తూర్పుమెట్ట, కాకిస్‌నూరు. -
బాబు 'ఊసరవెల్లి బస్సు యాత్ర'గా మార్చుకోవాలి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలో చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను ఊసరవెల్లి బస్సు యాత్రగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు తన ఉనికిని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2014లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లోని శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. -
సీమాంధ్ర నేతలు యూటర్న్ తీసుకోవడం సరికాదు
సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై యూటర్న్ తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన నేతలు... తదానంతర పరిణామల నేపథ్యంలో తమ విధానాలు మార్చుకోవడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సీమాంధ్ర నేతలకు హితవు పలికారు. ఆ ప్రాంతాల నేతలు వైఖరి వల్ల తెలుగు ప్రజల మధ్య నెలకొన్న సామరస్యం దెబ్బతింటోందని సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించకుంటే విపరీత పరిస్థితులు తలెత్తుతాయని సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచే పరిస్థితి లేదు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పరిస్థితి లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అని స్థానిక ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సీమాంధ్రలో ఆయన అడుగు పెట్టాలని ఆయన సూచించారు. అలాకాకుండా చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని గుర్నాథరెడ్డి ఈ సందర్బంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీమాంధ్ర ఎంపీలకు ముందే సమాచారం తెలిసిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు ఏమి తెలినట్లు డ్రామాలు ఆడుతున్నారని గుర్నాథ్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అదే జిల్లాల్లోని రాయదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాపు భారతి చేపట్టిన దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
విజయమ్మ దీక్షకు బాసటగా.. ఐదో రోజుకు ఆమరణ దీక్షలు
కోవూరులో ప్రసన్నకుమార్, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, రాయదుర్గంలో భారతి, కడపలో అవినాష్, పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ, తాడిపత్రిలో నర్సింహయ్య ఆమరణ దీక్షలు, కదిరిలో ఇస్మాయిల్ నిరశన, జంగారెడ్డిగూడెంలోఆదివిష్ణు ఆమరణ దీక్ష భగ్నం సాక్షి నెట్వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ, కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్ బాషా, నాగిరెడ్డి, కర్నూలులో మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు గురువారం నాటికి నాలుగురోజులు పూర్తయ్యాయి. జంగారెడ్డిగూడెంలో రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహారదీక్షను గురువారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ రెండోరోజు ఆమరణ దీక్ష కొనసాగించారు. రాయదుర్గంలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు భారతికి అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. కడప కలెక్టరేట్ ఎదుట దీక్షలకు జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీతోపాటు సీఈసీ సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవెల సుబ్రమణ్యంలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, రాప్తాడులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఇదిలాఉండగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని అన్నిజిల్లాల్లో రిలేదీక్షలు జరుగుతున్నాయి. పారీ నేతలు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షలతోపాటు, రిలే దీక్షలకు పెద్దఎత్తున మహిళలు, యువత తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. -
గంగవరం పోర్ట్ పనులు స్తంభింపజేసిన గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం అగదని రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా గంగవరం పోర్ట్ కార్యకలాపాలను ఆయన నేతృత్వంలో స్తంభింప చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. అలాగే విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. -
కొనసాగుతున్న నిరసనలు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరుపతిలో వివిధ రూపాల్లో నిరసన దృశ్యాలు. -
పార్టీ మారే ఆలోచనలో పలువురు నేతలు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల ఆందోళనకు పరిష్కారం చూపాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారు. 2009లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొందని, అనిశ్చితి ఏర్పడిందని, ఆత్మహత్యలు పెరిగాయని అందులో పేర్కొన్నారు. తాజా నిర్ణయం సైతం అలాంటి పరిస్థితులకు దారి తీసేలా ఉందని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూసి తీవ్ర మానసిక క్షోభకు గురై లేఖను రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖ వివాదాస్పదమైంది. త మ పార్టీ అధినేత యూటర్న్ తీసుకోవడం తెలు గు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. అధినేత రెండు నాల్కల ధోరణతో వ్యవహరిస్తుం డడం, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో టీడీపీ భాగస్వామిగా ఉండడం, తమ పార్టీకి చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుండడం వంటివాటిని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణపై యూ టర్న్ తీసుకుంటూ ప్రధానికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిం ది. కాంగ్రెస్‌తో కుమ్ముక్కు రాజకీయాలకు ఇది అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న తెలుగు తమ్ముళ్లు.. అధినేత ప్రధానికి రాసిన లేఖాస్త్రంతో డీలాపడిపోయారు. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. లేఖ వల్ల కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ఎదురురుదాడి, అసంతృప్తి సెగలను ఎవరికి వివరించాలో తెలియని అయోమయ పరిస్థితిలో స్థానిక నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ విషయంలో అధినేతను నిలదీయాలా.. లేక పార్టీని విడిచి రాజకీయ భవిష్యత్తు కోసం వలస బాటపట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్నా రు. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మంత్రుల వినతిని తిరస్కరించిన ఏపీ ఎన్జీఓలు
హైదరాబాద్: సమ్మె విరమించాలన్న మంత్రుల విజ్ఞప్తిని ఏపి ఎన్జిఓలు తీరస్కరించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు సమ్మె విరమించమని మంత్రులు కోరారు. మంత్రుల బృందం వినతిని ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. సమ్మె వాయిదా వేయడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. చర్చల అనంతరం ఏపి ఎన్జీఓ సంఘం నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమ్మె వాయిదా వేసుకునే ప్రసక్తిలేదని మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. జై సమైక్యాంధ్ర - విభజన వద్దు అంటూ ఏపి ఎన్జీఓ నేతలు నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు.