రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి.
కోవూరులో ప్రసన్నకుమార్, కర్నూలులో ఎస్‌వీ మోహన్‌రెడ్డి, రాయదుర్గంలో భారతి, కడపలో అవినాష్, పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ, తాడిపత్రిలో నర్సింహయ్య ఆమరణ దీక్షలు, కదిరిలో ఇస్మాయిల్ నిరశన, జంగారెడ్డిగూడెంలోఆదివిష్ణు ఆమరణ దీక్ష భగ్నం
సాక్షి నెట్‌వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ, కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్ బాషా, నాగిరెడ్డి, కర్నూలులో మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు గురువారం నాటికి నాలుగురోజులు పూర్తయ్యాయి.
జంగారెడ్డిగూడెంలో రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహారదీక్షను గురువారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ రెండోరోజు ఆమరణ దీక్ష కొనసాగించారు. రాయదుర్గంలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు భారతికి అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. కడప కలెక్టరేట్ ఎదుట దీక్షలకు జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు.
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీతోపాటు సీఈసీ సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవెల సుబ్రమణ్యంలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, రాప్తాడులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఇదిలాఉండగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని అన్నిజిల్లాల్లో రిలేదీక్షలు జరుగుతున్నాయి. పారీ నేతలు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షలతోపాటు, రిలే దీక్షలకు పెద్దఎత్తున మహిళలు, యువత తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు.