సాక్షి నెట్‌వర్క్: అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు సీమాంధ్ర జిల్లాల్లో సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆమె దీక్షకు మద్దతుగా స్వచ్ఛందంగా ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతున్నారు. కోస్తా, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లోనూ నిరశనలు చేపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ కృషిచేయగా, నేడు ఆమె కోడలు సోనియా అత్త ఆశయాలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని ముక్కలు చేసి పాలించాలనుకోవడం సిగ్గుచేటని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కోవూరులోని దీక్షాశిబిరంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌కు ప్రధాని పదవి కట్టబెట్టేందుకే తెలుగుజాతిని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి సందర్శించి, సంఘీభావం తెలిపారు.
తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు నేతల నుంచి వచ్చాయని.. కానీ సీమాంధ్రలో ప్రజలే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తుండటం హర్షణీయమని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష రెండో రోజూ విజయవంతంగా కొనసాగాయి. ధర్మవరంలో పార్టీ సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కడప కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాషా, నాగిరెడ్డిల ఆమరణదీక్షకు జిల్లా వ్యాప్తంగా యువకులు, అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి బాసటగా నిలిచారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్ కొండారెడ్డిలు సంఘీభావం తెలిపారు.
ఏలూరులో ఆళ్ల నాని దీక్ష: వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షకు సంఘీభావంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మంగళవారం ఏలూరు తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో నానిని కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, చింతలపూడి మాజీఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ మద్దతు ప్రకటించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆళ్ల నాని మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని సోనియాను హెచ్చరించారు.
తిరుపతిలో రిలే దీక్షలు: చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. తొలిరోజున పార్టీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, విభజన వల్ల వైఎస్ కలలుగన్న జల యజ్ఞం పూర్తికాదన్నారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు దీక్షాశిబిరంలో గజల్ శ్రీనివాస్ తెలిపారు. విజయమ్మ దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తిలో వైఎస్‌ఆర్ సీపీ నేతల రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీకన్వీనర్లు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.
సమరదీక్షకు మేముసైతం..
Published Wed, Aug 21 2013 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement