సమన్యాయం చేయనపుడు సమైక్యంగా ఉంచాల్సిందే: విజయమ్మ
గుంటూరులో మూడో రోజుకు చేరుకున్న ఆమరణ దీక్ష
కాంగ్రెస్, టీడీపీలు కూడబలుక్కుని నిరంకుశ విభజనకు తెరతీశాయి
ఓట్ల కోసం, సీట్ల కోసం తమకిష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాయి
ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరిగేవరకూ విశ్రమించేది లేదని.. సమన్యాయం జరగనపుడు రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టంచేశారు. రాష్ట్రం ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబానికి పెద్ద తన పిల్లలందరికీ ఒకేలా న్యాయం చేస్తాడని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరికి ఒక న్యాయం, మరొకరికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష టీడీపీలు కూడబలుక్కుని ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని వారికిష్టమొచ్చిన రీతిలో నిరంకుశంగా విభజించటానికి పూనుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు పిచ్చివాళ్లు కాదని వారికి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఉద్యమం కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. ఈ పోరాటంలో అంతా సంయమనం పాటించాలని కోరారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయమ్మ సోమవారం గుంటూరులో ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమర దీక్ష వేదిక వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచీ ఒకే మాటకు కట్టుబడి ఉందని, ప్రజలకు సమన్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనేదే తమ విధానమని పునరుద్ఘాటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు తాము అనుకూలమని లేఖ రాయడం వల్లే కాంగ్రెస్ విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటున్నారు.. ఆయన ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని, కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదీ...
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలంగాణను, సీమాంధ్రను రెండు కళ్ళలా ఒకే రకంగా చూశారని విజయమ్మ పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తన స్వలాభం కోసం ప్రతిపక్ష టీడీపీతో చేతులు కలిపి కుట్రలతో నిరంకుశ విభజనకు తెరతీసిందని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం తెలుగు ప్రజలందరికీ చెందుతుందని.. అది అరవై ఏళ్లుగా తెలుగు ప్రజలు కష్టపడి కట్టుకున్న అపురూప కట్టడమని అభివర్ణించారు. 1956 నుంచీ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను హైదరాబాద్‌లో నిర్మించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం లేదని, అన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తోందని, ఇక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చే అవకాశాలు లేవని అన్నారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి గ్రామం నుంచి యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి పని చేసుకుంటున్నారని వారందరికీ హైదరాబాద్ కావల్సిందేనని స్పష్టంచేశారు.
ప్రభుత్వ చర్యలకు భయపడొద్దు...
సీమాంధ్రలో ఎన్‌జీవోలు చేపట్టిన సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించటం కుట్రలో ఒక భాగమేనని విజయమ్మ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఉద్యోగులు భయపడవద్దన్నారు. రానున్నది రామరాజ్యం కనుక ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ వారికి న్యాయం చేస్తుందని అభయమిచ్చారు. ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాకతప్పదని.. ప్రజాగ్రహంతో ప్రభుత్వాలు కూలటం తథ్యమని స్పష్టంచేశారు. విద్యార్థులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా తమ విద్యను మరవొద్దని చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.
రైతులను నట్టేట ముంచారు: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్య తొలగుతుందని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన బతికుండగానే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేయటానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రభుత్వానికి ప్రజల విషయంలో చిత్తశుద్ధిలేదని.. అదే ఉంటే వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కి మోసం చేసేదికాదన్నారు. రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచారని ఆమె ధ్వజమెత్తారు. పార్టీలో అందరూ ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ప్రజల కోసం, వారి క్షేమం కోసం పదవులను త్యజించి రాజీనామాలు చేసి ఉన్నతాశయాలతో పోరాటం చేస్తున్నామని విజయమ్మ పేర్కొన్నారు.
వారిద్దరూ ఒకరికొకరు సలహాదారులే...
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ప్రకటన వెలువడిన తరువాత పది రోజులకు తాను విభజనకు వ్యతిరేకమంటూ ప్రకటన చేయటం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అధికారంలో ఉన్న వారికి తెలియకుండా విభజన జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. ఆ రోజే ఎందుకు ఎదురు తిరగలేదని నిలదీశారు. ఇప్పుడు ప్రజల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి భయపడి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు వ్యతిరేకమంటూ మాటలు చెప్తున్నారని తూర్పారబట్టారు. కిరణ్‌కు చంద్రబాబు ఒకరికొకరు సలహాదారులేనని.. కూడబలుక్కుని ప్రజలను మోసం చేసేందుకు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
దీక్షలో రెండో రోజు...
వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే దీక్షా వేదికపైకి చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణం మొత్తం పెద్ద ఎత్తున మహిళలు, యువకులతో కిక్కిరిసిపోయింది. దీక్షా ప్రాంగణం వద్ద కేంద్ర బలగాల్ని భారీగా మోహరించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు సమైక్య ఉద్యమకారులు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై మండిపడ్డారు. ఓట్ల రాజకీయం కోసం కాంగ్రెస్‌కు జత కలిసిన చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేతలు దాడి వీరభద్రరావు, బాలినేని శ్రీనివాసరెడ్డిలు నిప్పులు చెరిగారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ఆహార భద్రత బిల్లు పాస్ కాకుండా చూడాలని బాలినేని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పట్నుంచి విజయమ్మ నిరాహార దీక్షలోనే ఉన్నారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు 32 గంటలు గడిచింది. గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం విజయమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వెల్లువలా సంఘీభావం
అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటం అందుకున్న విజయమ్మకు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పెల్లుబుకుతోంది. తానే పుట్టెడు కష్టాల్లో ఉండి కూడా.. రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన ప్రజానాయకురాలికి సంఘీభావం తెలిపేందుకు జనం వెల్లువెత్తుతున్నారు. దీక్ష రెండో రోజైన మంగళవారం వివిధ జిల్లాల నుంచి వైఎస్ అభిమానులు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, వ్యాపారులు, విద్యార్థులు, సామాజిక వర్గాల సంఘాల నాయకులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల వారు విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చారు.
మహిళలు పెద్ద సంఖ్యలో విజయమ్మను చూసేందుకు దీక్షా వేదిక వద్ద బారులు తీరుతున్నారు. ఆర్‌టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో బస్సులు లేకపోవటంతో.. జిల్లాల నుంచి ఎవరికి వారు బృందాలుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని అద్దెకు మాట్లాడుకుని వచ్చారు. కృష్ణా జిల్లా పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, కొడాలి నానిలు విజయమ్మను కలిశారు. విజయమ్మ దీక్షా శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చిన వాహనాల్ని గుంటూరు శివారుల్లోనే పోలీసులు నిలువరించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన తమను పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పులిచింతల ఊసేదీ?: విజయమ్మ
దశాబ్దాలుగా వృథా అవుతున్న మిగులు జలాల్ని, వరదనీటిని సద్వినియోగం చేసుకుని.. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ‘జలయజ్ఞం’ సాగునీటి పథకాల నిర్మాణాల్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని విజయమ్మ ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు సకాలంలో నీటిని అందించి, వరదలు, తుపాన్ల నుంచి పంటల్ని కాపాడేందుకు చేపట్టిన పులిచింతల ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తిచేయలేదని తప్పుపట్టారు.
ఈ ఏడాది ఆగస్టు 15న డెల్టాకు ఈ ప్రాజెక్ట్‌ను అంకితం చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. స్వయంగా చెప్పిన గడువు దాటిపోయినా పులిచింతల ఊసే ఎత్తటం లే దని ఎండగట్టారు. ఈ సీజన్‌లోనూ కృష్ణా డెల్టా రైతాంగానికి పులిచింతల ఉపయోగపడటం సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. ప్రాజెక్టులో ఆరు గేట్ల ఏర్పాటు ఇంకా పూర్తికాలేదని పేర్కొన్నారు. ఫలితంగా వరదనీటిని నిల్వచేసే అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం కృష్ణాలోని వరద నీరంతా వృథాగానే పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిపై ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో రైతులు మరో ఏడాది కాలాల్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
రూ. 1,281 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వైఎస్ ఎంతగానో ఆసక్తి చూపారని, ఈ ప్రాజెక్ట్‌పై అప్పట్లో కొన్ని ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమైన ఆపోహలను తొలగించి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తిచేసేందుకు ఆయన కృషిచేశారని విజయమ్మ వివరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతుల ఆశలను నిలువునా ముంచిందని విమర్శించారు. పులిచింతల నిర్మాణం పూర్తికావటం ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాలో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి సకాలంలో సాగునీరు అందించటంతో రైతులు తుపానులు, వరదలతో పంట నష్టపోకుండా ఆదుకోవటం సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రాణం ఉన్నంత వరకూ పోరాటం: వై.ఎస్.విజయమ్మ
Published Wed, Aug 21 2013 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement