ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి.. లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి.. అని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
సాక్షి, విజయవాడ : ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి.. లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి.. అని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19 నుంచి విజయవాడలో తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షకు అవనిగడ్డ ఉపఎన్నిక కోడ్ సాకుగా చూపించి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో దీక్షావేదికను గుంటూరు నగరానికి మార్చారు. పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మాట్లాడుతూ..
ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా విజయవాడ పోలీసుల నిరంకుశ వైఖరి కారణంగా అనుమతి నిరాకరించారని, పార్టీలో తర్జనభర్జనల అనంతరం వివాదాలకు తావుండకూడదనే సదుద్దేశంతో దీక్షావేదికను గుంటూరుకు మార్చినట్టు ప్రకటించారు. ప్రజలకు మేలు చేయడమే విజయమ్మ దీక్ష ఉద్దేశమని, డ్రామాలు చేయడం కాదన్నారు. అందుకే గుంటూరు బస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు స్థలంలోకి మార్చినట్టు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చేపట్టిన దీక్ష ప్రజలకు న్యాయం జరిగేవరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
విజయమ్మ దీక్షకు అనుమతి ఇవ్వడం లేదని శనివారం సాయంత్రం విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు, వైఎస్ విజయమ్మ దీక్షల కోసం పెట్టిన దరఖాస్తులను ఎన్నికల కమిషన్‌కు పంపించామని, అక్కడి నుంచి అనుమతి వచ్చే వరకు ముందుకు వెళ్లవద్దంటూ దేవినేని ఉమామహేశ్వరరావుకు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం దీక్షకు బయలుదేరిన ఉమామహేశ్వరరావు బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల సంఘం నుంచి వివరణ వచ్చింది.
ఎన్నికల సంఘం ఏ పార్టీ అయినా దీక్షలు చేస్తే, వాటిని నిషేధించదని, శాంతిభద్రతల వ్యవహారాన్ని స్థానిక యంత్రాంగమే చూసుకోవాలని ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, కోడ్ అమలు నేపథ్యంలో దీక్షలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వడం లేదని సీపీ శ్రీనివాసులు చెబుతున్నారు. పార్టీ నగర నేతలు జలీల్‌ఖాన్, గౌతమ్‌రెడ్డి, అడుసుమిల్లి జయప్ర కాష్ సీపీని శనివారం సాయంత్రం కలిసి చర్చలు జరిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాను అనుమతి ఇవ్వలేనని సీపీ స్పష్టం చేయడంతో వారు చట్టబద్ధంగా దీక్షలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
అనుమతి ఇవ్వలేదు : సీపీ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వైఎస్ విజయమ్మ దీక్షకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. ఈ నెల 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో ప్రదర్శనలు, లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉండదన్నారు. ఎన్నికల కమిషన్ దీక్షలకు అభ్యంతరం లేదని చెప్పినా ఎన్నికలను నిర్వహించే బాధ్యత తమపై ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలి పారు. ప్రస్తుతం తాము ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తున్నామని, ఈ సమయంలో కోడ్‌ను ఉల్లంఘించి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇది అప్రజాస్వామికం : ఉదయభాను
విజయమ్మ దీక్షకు అనుమతి నిరాకరించడం పూర్తిగా అప్రజాస్వామికమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించేలా చేశారన్నారు. విజయమ్మ దీక్ష చేపడితే రాష్ట్రమంతా ఆమె వైపు చూస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల కమిషన్ దీక్షకు అనుమతి ఇచ్చినా జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీసు కమిషనర్ అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. చెప్పిన మాట ప్రకారం సమైక్య రాష్ట్రం కోసం దీక్ష చేయడం కోసమే వేదికను గుంటూరుకు మార్చినట్టు ఆయన తెలిపారు.