విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మార్పు
అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకుండా.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్ష వేదిక మారింది. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడ బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్సు ఎదురుగా దీక్ష చేపట్టాలని తొలుత నిర్ణయించినా, తర్వాత ఈ వేదికను గుంటూరుకు మారుస్తూ పార్టీ అగ్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు బస్టాండు ఎదురుగా గల ఓ ప్రైవేటు స్థలంలో విజయమ్మ దీక్ష చేపట్టనున్నారు.
ఈ నెల 19 ఉదయం గుంటూరులో వైఎస్ విజయమ్మ దీక్షను ప్రారంభిస్తారు. విజయమ్మతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పార్టీ నేతలు వారిస్తున్నారు. విజయమ్మ మాత్రమే దీక్ష చేస్తారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేయొచ్చని సూచిస్తున్నారు.