బస్టాండ్ సమీపంలో సమరదీక్ష వేదికపై విజయమ్మ, సుచరితలతో శోభానాగిరెడ్డి
- టీడీపీ జిల్లా పరిశీలకురాలిగా సుపరిచితం
- వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి సమరదీక్షలో విజయమ్మకు వెన్నంటే...
- శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఖిన్నులైన జిల్లా నాయకులు
సాక్షిప్రతినిధి, గుంటూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మరణం జిల్లా వాసులను, వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది.
పార్టీలకు అతీతంగా నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. జల్లాతో శోభానాగిరెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆమె 2005-06లోపార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు. పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా ఆమెకు మంచి పేరుండేది. పరిశీలకురాలి హోదాలోనే ఏడాది కాలంలోనే ఆమె సుమారు ఏడెనిమిది సార్లు జిల్లాకు వచ్చారు.
కార్యకర్తల సమస్యలను, విన్నపాలను ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే వారు. అటు తరువాత ఆమె పీఆర్‌పీలో చేరడం తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు.
పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు తోడుగా ఉండేవారు. విజయమ్మ ఎక్కడ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నా వెంట శోభానాగిరెడ్డి ఉండేవారు. గత ఏడాది బాపట్లలో జరిగిన పార్టీ మహిళా సదస్సుకు హాజరై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నినదించారు.
రాష్ట్ర విభజన నేపధ్యంలో గత ఏడాది ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఐదురోజుల పాటు గుంటూరు నగరంలోని ఆర్టీసీబస్టాండ్ ఎదుట విజయమ్మ సమరదీక్ష చేపట్టినపుడు ఆమెకు తోడుగా శోభ ఇక్కడే ఉన్నారు. పోలీసులు విజయమ్మను అన్యాయంగా, కనీస నియమ నిబంధనలను పాటించకుండా జీజీహెచ్‌కు తరలించడంతో ఆమె ఆసుపత్రి బయటే ధర్నాకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 25వ తేదీన విజయమ్మ దీక్ష విరమించే వరకు శోభానాగిరెడ్డి ఆమెకు తోడుగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన కృష్ణాట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద చేపట్టిన సాగుపోరుదీక్షకు శోభానాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. ఆమె ఆకస్మిక మరణంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.