మంత్రుల వినతిని తిరస్కరించిన ఏపీ ఎన్జీఓలు
హైదరాబాద్: సమ్మె విరమించాలన్న మంత్రుల విజ్ఞప్తిని ఏపి ఎన్జిఓలు తీరస్కరించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు సమ్మె విరమించమని మంత్రులు కోరారు.
మంత్రుల బృందం వినతిని ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. సమ్మె వాయిదా వేయడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. చర్చల అనంతరం ఏపి ఎన్జీఓ సంఘం నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమ్మె వాయిదా వేసుకునే ప్రసక్తిలేదని మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. జై సమైక్యాంధ్ర - విభజన వద్దు అంటూ ఏపి ఎన్జీఓ నేతలు నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు.