APNGO Strike
-
ఏపీఎన్జీఓల సమ్మె తాత్కాలిక విరమణ
-
తొలిరోజు సమ్మెవిజయవంతం: అశోక్ బాబు
హైదరాబాద్: ఎపి ఎన్జీఓల తొలిరోజు సమ్మె విజయవంతమైనట్లు ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు చెప్పారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర అంతటా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. సమ్మె విజయవంతమైనట్లు అన్ని జిల్లాల నుంచి తమకు సమాచారం అందినట్లు చెప్పారు. సమ్మెకు సహకరించిన ఉద్యోగులకు ఆయన దన్యవాదాలు తెలిపారు. సమ్మెలో పాల్గొనేవారు, తమకు సహకరించే వారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు చేయవద్దని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాము ఇక్కడ సమ్మె చేయడానికి వీలులేదని, తమని విజయవాడ వెళ్లమని, తిరుపతి వెళ్లమని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు. తాము రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. శాంతియుత వాతావరణం ఉంటేనే చర్చలలో పాల్గొంటామని చెప్పారు. -
సమ్మెతో సాధించేదేం లేదు చర్చలకు రండి: ఏపీ ఎన్జీవోలకు దిగ్విజయ్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెతో సాధించేదేమీ ఉండదని.. సమ్మెను విరమించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తిచేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘మీరు పదేపదే కోరుతున్నా ఏపీ ఎన్జీవోలు సమ్మెకు దిగుతున్నారు కదా?’ అని ప్రశ్నించగా.. ఎవరూ సమ్మెకు దిగరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్జీవోలను సమ్మె విరమించుకోవాలని కోరుతున్నా. దీనివల్ల ప్రజలకు కష్టాలు తప్ప సాధించేదేమీ ఉండదు. సమ్మె బదులు చర్చలకు రండి. విభజన అంశంలో మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై మాట్లాడేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఐదుగురు బృదంగా వచ్చి రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడైనా మా ముందు వాదనలు వినిపించవచ్చు. మేం అందుబాటులో ఉంటాం’’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగుతున్నారుగా అని అడగ్గా.. దీనిపై సీమాంధ్ర నేతలతోనే మాట్లాడుతానని బదులిచ్చారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ సభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనన్నారు. -
మంత్రుల వినతిని తిరస్కరించిన ఏపీ ఎన్జీఓలు
హైదరాబాద్: సమ్మె విరమించాలన్న మంత్రుల విజ్ఞప్తిని ఏపి ఎన్జిఓలు తీరస్కరించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు సమ్మె విరమించమని మంత్రులు కోరారు. మంత్రుల బృందం వినతిని ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. సమ్మె వాయిదా వేయడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. చర్చల అనంతరం ఏపి ఎన్జీఓ సంఘం నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమ్మె వాయిదా వేసుకునే ప్రసక్తిలేదని మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. జై సమైక్యాంధ్ర - విభజన వద్దు అంటూ ఏపి ఎన్జీఓ నేతలు నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు.