
సమ్మెతో సాధించేదేం లేదు చర్చలకు రండి: ఏపీ ఎన్‌జీవోలకు దిగ్విజయ్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్‌జీవోలు చేపట్టిన సమ్మెతో సాధించేదేమీ ఉండదని.. సమ్మెను విరమించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తిచేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. దిగ్విజయ్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘మీరు పదేపదే కోరుతున్నా ఏపీ ఎన్‌జీవోలు సమ్మెకు దిగుతున్నారు కదా?’ అని ప్రశ్నించగా.. ఎవరూ సమ్మెకు దిగరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఎన్‌జీవోలను సమ్మె విరమించుకోవాలని కోరుతున్నా. దీనివల్ల ప్రజలకు కష్టాలు తప్ప సాధించేదేమీ ఉండదు. సమ్మె బదులు చర్చలకు రండి.
విభజన అంశంలో మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై మాట్లాడేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఐదుగురు బృదంగా వచ్చి రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడైనా మా ముందు వాదనలు వినిపించవచ్చు. మేం అందుబాటులో ఉంటాం’’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగుతున్నారుగా అని అడగ్గా.. దీనిపై సీమాంధ్ర నేతలతోనే మాట్లాడుతానని బదులిచ్చారు. తెలంగాణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ సభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనన్నారు.