
అశోక్ బాబు
హైదరాబాద్: ఎపి ఎన్జీఓల తొలిరోజు సమ్మె విజయవంతమైనట్లు ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు చెప్పారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర అంతటా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. సమ్మె విజయవంతమైనట్లు అన్ని జిల్లాల నుంచి తమకు సమాచారం అందినట్లు చెప్పారు. సమ్మెకు సహకరించిన ఉద్యోగులకు ఆయన దన్యవాదాలు తెలిపారు. సమ్మెలో పాల్గొనేవారు, తమకు సహకరించే వారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు చేయవద్దని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తాము ఇక్కడ సమ్మె చేయడానికి వీలులేదని, తమని విజయవాడ వెళ్లమని, తిరుపతి వెళ్లమని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు. తాము రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. శాంతియుత వాతావరణం ఉంటేనే చర్చలలో పాల్గొంటామని చెప్పారు.