నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
మాచర్లటౌన్, న్యూస్‌లైన్: నాడు కాంగ్రెస్ నాయకులను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వారినే తన పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ అడిగిన చంద్రబాబు నిత్యం కాంగ్రెస్ నాయకులను విమర్శించారన్నారు.
శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం దరిని చంద్రబాబు దుమ్మెత్తి పోశారని, నేడు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ టీడీపీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతమవు తుందని చెప్పుకుంటున్నారన్నారు. బాబు రాజకీయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు.
అంతేకాక సీమాంధ్రను అభివృద్ధి చేయగలిగిన శక్తిమంత నేత జగన్ అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్ అన్నారు.అందుకే ఆయనపై విశ్వాసంతో అన్ని ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలువబోతున్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.