తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్
అధికారులకు చంద్రబాబు ఆదేశం.. పలు అంశాలపై సమీక్ష
హైదరాబాద్: ఆదాయ వనరులు, రుణ పరపతి పెంపు విషయంలో తెలంగాణ స్థాయికి సీమాంధ్రను తీసుకువెళ్లడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర విభజన, సీమాంధ్రలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.
చంద్రబాబు మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. కొత్తగా విమానాశ్రయాలను ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు, రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఏవి? వీటి కోసం ఎంత మేర పెట్టుబడులు అవసరం అవుతాయో తెలియజేయూలన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై వారంలో నివేదికలు సమర్పిస్తామని నూతన ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు చెప్పారు.