గంగవరం పోర్ట్ పనులు స్తంభింపజేసిన గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం అగదని రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా గంగవరం పోర్ట్ కార్యకలాపాలను ఆయన నేతృత్వంలో స్తంభింప చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనపై కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. అలాగే విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది.