బాబు స్క్రిప్టు.. షర్మిల రిపీట్‌  | Sharmila also lies with Babus script | Sakshi
Sakshi News home page

బాబు స్క్రిప్టు.. షర్మిల రిపీట్‌ 

Published Fri, Jan 26 2024 5:35 AM | Last Updated on Sun, Feb 4 2024 4:49 PM

Sharmila also lies with Babus script - Sakshi

సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు... అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్క్రిప్టును చదవటానికి ఇతరులను ప్రిపేర్‌ చేస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దించేసిన బాబు... ఇపుడు పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిలను ప్రవేశపెట్టి, తన స్క్రిప్టును ఆమెచేత కూడా వల్లె వేయిస్తున్నారు. అందుకేనేమో... గంగవరం పోర్టుపై కనీస అవగాహన కూడా లేనట్లుగా ఆమె చంద్రబాబు చేసిన ఆరోపణలనే రిపీట్‌ చేశారు. రూ.70,000కోట్ల విలువైన గంగవరం పోర్టును అదానీ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు అమ్మేసిందంటూ ఆమె బుధవారం విశాఖలో మాట్లాడారు.

అసలు ఆ పోర్టు విలువ ఆమె చెప్పిన దాన్లో 10 శాతం కూడా లేదని... అందులోనూ ఆ పోర్టులో 89.6 శాతం వాటా ప్రయివేటు వారిదని, దాన్ని అదానీ కొనుగోలు చేసిందని... అది ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు డీల్‌ అనే వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు.  పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన గంగవరం పోర్టులో 89.6 శాతం వాటా ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు, ఆయనకు పెట్టుబడులు సమకూర్చిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీది. మరి అలాంటి పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు ఎలా విక్రయిస్తుంది? రాష్ట్రం విక్రయించగలిగేది తన చేతిలో ఉన్న 10 శాతం వాటానే కదా? వాస్తవానికి డీవీఎస్‌ రాజు గ్రూపు–అదానీ గ్రూపు ఆ పోర్టు విలువను ఆర్థిక సంస్థల చేత మదింపు చేయించగా రూ.6,200 కోట్లుగా లెక్కగట్టాయి.

దీంతో అదే ధరకు డీవీఎస్‌ రాజు, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకున్న వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. మరి ఈ షర్మిల చెప్పిన రూ.70వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? వాస్తవానికి అవి చంద్రబాబు స్క్రిప్టులో నుంచి వచ్చాయి. గతంలో బాబు కూడా అది రూ.70వేల కోట్ల విలువైన పోర్టు అని... దాన్ని ప్రభుత్వం రూ.600 కోట్లకే విక్రయించేసిందని పచ్చి అబద్ధాలతో ప్రభుత్వంపై బురదజల్లారు. కానీ ప్రభుత్వం వాస్తవాలను వివరిస్తూ గట్టిగా స్పందించటంతో... ఇప్పుడు అదే బురదను షర్మిల ద్వారా చల్లిస్తున్నారు.  

నిజానికి ప్రభుత్వానిది ఈ పోర్టులో 10.4 శాతం వాటా మాత్రమే. అయితే పోర్టు విస్తరణకు వీలుగా ఆ వాటా విక్రయించాలని కొనుగోలుదారు అభ్య­ర్థించటంతో ప్రభుత్వం నిపుణులు సూచించిన ధరకన్నా రూ.20 కోట్లు అధికంగానే... అంటే రూ.644.45 కోట్లకు దీన్ని విక్రయించింది. పైపెచ్చు ఆ నిధులతో ఇపుడు మరో మూడు కొత్త పోర్టులను ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేస్తోంది. ఇక డీవీఎస్‌ రాజు, ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వార్‌బర్గ్‌ పింకస్‌ చేతి నుంచి అదానీ గ్రూపు చేతికి మారింది పోర్టు నిర్వ­హణ మాత్రమే. ప్రభుత్వంతో గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులూ లేవు. మరి భూములతో సహా  విక్రయించేసినట్లు మాట్లాడటం షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనం కాదా?. 

కొత్త పోర్టుల నిర్మాణానికి నిధులు 
అదానీ గ్రూపు ప్రతిపాదనను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్‌ 4న కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసింది. విలువ మదింపు కోసం సెబీ గుర్తింపు పొందిన కేపీఎంజీ, న్యాయ సలహాల కోసం జేఎస్‌ఏ అసోసియేట్స్, ఒప్పందంలో పాటించాల్సిన సలహాల కోసం గ్రాంట్‌ థార్న్‌టన్‌లకు బాధ్యతలను ఈ కమిటీ అప్పగించింది.

వారు గంగవరం పోర్టు షేరు ధరను రూ.115గా లెక్కించారు. రూ.5 అదనంగా చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌  సీజే సలహా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్లింది. తన 10.4 శాతం వాటాను రూ.644.45 కోట్లకు విక్రయించింది. ఈ మొత్తాన్ని కొత్తగా చేపట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులకు ప్రభుత్వం వినియోగిస్తోంది. 

పోర్టు విలువ రూ.6,200 కోట్లుగా మదింపు 
పీపీపీ విధానంలో ప్రమోటరు డీవీఎస్‌ రాజు గంగవరం పోర్టు లిమిటెడ్‌ పేరుతో ఈ పోర్టును అభివృద్ధి చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 1,800 ఎకరాల భూమి విలువ రూ.54 కోట్లుగా లెక్కించి పోర్టులో 10.4 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన వాటాలో ప్రధాన ప్రమోటరు డీవీఎస్‌ రాజు చేతిలో 58.1 శాతం, పోర్టు నిర్మాణానికి నిధులు సమకూర్చిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (వార్‌బర్గ్‌ పింకస్‌) పేర 31.5 శాతం ఉన్నాయి.

పోర్టు విలువను రూ.6,200 కోట్లుగా మదింపు చేసి, ఆ మేరకు ప్రమోటర్ల నుంచి 89.6 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అది ఆ ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు ఒప్పందం. ఇక పోర్టు కొన్నాక అదానీ గ్రూపు కొత్తగా రెండు టెర్మినల్స్‌ అభివృద్ధి చేయడంతోపాటు లాజిస్టిక్‌ వంటి విభాగాల్లో భారీ విస్తరణ చేపట్టింది. కానీ దీన్లో ప్రభుత్వ వాటా 10.4 శాతం ఉండటం వల్ల ఇబ్బందులు రావటంతో ఆ వాటాను కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.  ప్రమోటర్లకు చెల్లించిన విధంగానే షేరుకు రూ.120 చొప్పున చెల్లించడానికి ముందుకు వచ్చింది. 

ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం 
ఇక పోర్టులో వాటా విక్రయం తర్వాత రాయితీలకు సంబంధించి అదానీ గ్రూపుతో ఏపీ మారిటైమ్‌ బోర్డు స్పష్టమైన ఒప్పందం చేసుకుంది.  30 ఏళ్ల లీజు తర్వాత పోర్టు ఆస్తులు, భూములు తిరిగి ఇచ్చే నిబంధనను  అందులో పొందుపరిచింది. ఒకవేళ లీజు గడువు పెంచుకోవాలంటే ప్రభుత్వ  అనుమతితో 10 ఏళ్లు చొప్పున రెండు సార్లు పెంచుకునేందుకు అనుమతి­స్తారు. ఇక పోర్టు వ్యాపారంలో 2.1 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాలి.

ఆ విధంగా పోర్టు నిర్వహణను ఆదానీ చేపట్టిన తర్వాత రెండేళ్లలో (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో) రాయల్టీ, లీజు అద్దె రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.60.01 కోట్ల ఆదాయం సమకూరింది. త్వరలో కొత్తగా అభివృద్ధి చేసిన రెండు కార్గో టెర్మినల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని, ఈ పోర్టుపై ప్రభు­త్వం ఎలాంటి హక్కులను వదులుకోలేదని ఏపీ మారిటైమ్‌ బోర్డు స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement