ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అని స్థానిక ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
ఆ తర్వాతే సీమాంధ్రలో ఆయన అడుగు పెట్టాలని ఆయన సూచించారు. అలాకాకుండా చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని గుర్నాథరెడ్డి ఈ సందర్బంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీమాంధ్ర ఎంపీలకు ముందే సమాచారం తెలిసిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు.
ఇప్పుడు పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు ఏమి తెలినట్లు డ్రామాలు ఆడుతున్నారని గుర్నాథ్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అదే జిల్లాల్లోని రాయదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాపు భారతి చేపట్టిన దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.