Gurunath Reddy B
-
'నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా'
అనంతపురం: అనంతపురం జిల్లాలోని మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తన కుటుంబం అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సురి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. -
ప్రభాకరా.. ముందు పార్కులు కాపాడు...!
ఎమ్మెల్యేకు ఎర్రిస్వామిరెడ్డి హితవు అనంతపురం : ‘నగర పాలక సంస్థకు పాలకవర్గం లేని సమయంలో ఎన్ని స్థలాలను పార్కులుగా చూపించారు? ఈ రోజు అవన్నీ ఏమయ్యాయి? నగరంలో ముందుగా పార్కులు కాపాడు.. తర్వాత కార్యకర్తల గురించి ఆలోచించు.. కనిపించిన స్థలాలను కబ్జా చేస్తున్న మీరు నీతులు చెప్పడం హాస్యాస్పదం’ అంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిపై వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బీ.ఎర్రిస్వామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకటో డివిజన్లో వంక పొరంబోకు స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిప్పిస్తామని చెప్పి వారిని ఎమ్మెల్యే టీడీపీలోకి చేర్చుకున్నారని, వారు తన వద్దకు వస్తే పట్టాలిప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశానని అన్నారు. అయితే ఎమ్మెల్యే పట్టాలెలా ఇప్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులను బెదిరించి పట్టాలిప్పిస్తావా? అని ప్రశ్నించారు. మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వైఎస్సార్సీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చాడంటూ ప్రచారం చేస్తున్నారని, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. నగర అభివృద్ధిని పక్కన పెట్టి ఎమ్మెల్యే, మేయర్ కుమ్మక్కై పర్సెంటేజీల పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నగర పాలక సంస్థలో అధికారులను బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తూ సీ-బిల్లులు చేసుకుంటున్నారని ఎర్రిస్వామి రెడ్డి ఆరోపించారు. మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి టీడీపీలో చేరుతున్నాడని దుష్ర్పచారం చేస్తూ, ముందుగా మీరు చేరితే మీకే గుర్తింపు ఉంటుందని చెబుతూ ఎమ్మెల్యే బలవంతంగా ప్రజల్ని టీడీపీలో చేర్పించుకుంటున్నారన్నారు. 1వ డివిజన్లో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారు పార్టీలోకి చేరకపోతే కేసులు పెట్టిస్తామని, గుడిసెలు తొలగిస్తామంటూ భయపెట్టారని ఆరోపించారు. నెల రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి తమ ఛోటా నాయకులతో రాయబారం నడుపుతున్నారన్నారు. అభివృద్ధిని విస్మరించిన టీడీపీలోకి ఎవరూ వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేసి ప్రజలను దగ్గర చేసుకోవాలి తప్ప ప్రలోభాలకు గురి చేస్తే ఎవరూ నమ్మరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఊపిరున్నంత వరకూ జగన్ వెంటే
వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం : ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. అప్పటి నుంచి వైఎస్ వెన్నంటే ఉన్నాం. విలువలతో కూడిన రాజకీయాలు వైఎస్ కుటుంబం నుంచే నేర్చుకున్నాం. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాం’ అని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బి. ఎర్రిస్వామిరెడ్డి స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వైఎస్సార్సీపీని వీడుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన నివాసంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీని మార్చాల్సిన దుస్థితి తమకు లేదన్నారు. మిస్సమ్మ స్థలంపై అనవసర రాద్ధాంతం మిస్సమ్మ స్థలంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎర్రిస్వామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా, అక్రమంగా ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేదని, వేలం ద్వారామ దక్కించుకున్నట్లు తేల్చిచెప్పారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చినా... కొందరు పనికట్టుకుని పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రైవేట్ పాపర్టీ అని స్వయంగా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మిస్సమ్మ స్థలంపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. -
‘సంక్షేమం మరచిన పార్టీలకు బుద్ధి చెప్పండి’
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం నగరంలోని భవాని నగర్, గఫూర్ వీధి తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన యువనేతతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమంపై భరోసా కల్పించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏనాడు ప్రజా శ్రేయస్సు కోరుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రస్తుతం నమ్మశక్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేత ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా పాల్గొన్నారు. -
కావాలనే దుష్ప్రచారం: ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నట్లు తనపై కావాలనే దుష్ప్రచారం చేశారని ఆయన మంగళవారమిక్కత తెలిపారు. 40 ఏళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్నాథరెడ్డి అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వైఎస్ జగన్‌తో పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. మరోవైపు ఇదే విషయంపై వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఇబ్బందులు సాధారణమేనన్నారు. గుర్నాథరెడ్డి వ్యవహారంలో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. -
బాబు లేఖ వల్లే విభజన ప్రకటన
అనంతపురం : సమైక్యాంధ్రకు జైకొట్టిన తర్వాతే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయాలని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే సోనియా రాష్ట్రాన్ని విభజించారని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన న్యాయవాదులను గుర్నాథరెడ్డి శనివారం పరామర్శించారు మరోవైపు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. చేతిలో పూలు పట్టుకుని సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రుయా ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. విభజన ప్రకటనతో ప్రజలందరిని ఆందోళనకు గురి చేశారని ఉద్యోగులు మండిపడ్డారు. విభజన ప్రకటనని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అని స్థానిక ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సీమాంధ్రలో ఆయన అడుగు పెట్టాలని ఆయన సూచించారు. అలాకాకుండా చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలుంటాయని గుర్నాథరెడ్డి ఈ సందర్బంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీమాంధ్ర ఎంపీలకు ముందే సమాచారం తెలిసిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు ఏమి తెలినట్లు డ్రామాలు ఆడుతున్నారని గుర్నాథ్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అదే జిల్లాల్లోని రాయదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాపు భారతి చేపట్టిన దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కింద కూర్చొని ఎమ్మెల్యే గురునాథరెడ్డి నిరసన
అనంతపురం: పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కింద కూర్చొని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ఆయన దుయ్యబట్టారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మంత్రి రఘువీరా రెడ్డి ప్రసంగాన్ని గురునాథ రెడ్డి అడ్డుకోబోయారు. పోలీసులు ఆయనను బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా మంత్రి రఘువీరా తన ప్రసంగాన్ని కొనసాగించారు. విదేశీ మహిళ సారధ్యంలో మంత్రులుగా ఉన్నందునే వారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారని ఎమ్మెల్యే గురునాథ రెడ్డి విమర్శించారు. భారీ భద్రత నడుమ ఇక్కడ వేడుకలు నిర్వహించారు. వేడుకలను చూసేందుకు ప్రజలను అనుమతించలేదు. పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలను అనుమతించకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సమైక్యవాదుల ఆందోళన కార్యక్రమాలు 16వ రోజు కొనసాగుతున్నాయి. మంత్రి రఘువీరా రెడ్డిని అడ్డుకునేందుకు న్యాయవాదులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి రఘువీరా రెడ్డి రాజీనామా చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.