ఎమ్మెల్యే గురునాథ రెడ్డి
అనంతపురం: పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కింద కూర్చొని నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ఆయన దుయ్యబట్టారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తుందని విమర్శించారు.
రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మంత్రి రఘువీరా రెడ్డి ప్రసంగాన్ని గురునాథ రెడ్డి అడ్డుకోబోయారు. పోలీసులు ఆయనను బుజ్జగించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా మంత్రి రఘువీరా తన ప్రసంగాన్ని కొనసాగించారు. విదేశీ మహిళ
సారధ్యంలో మంత్రులుగా ఉన్నందునే వారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారని ఎమ్మెల్యే గురునాథ రెడ్డి విమర్శించారు.
భారీ భద్రత నడుమ ఇక్కడ వేడుకలు నిర్వహించారు. వేడుకలను చూసేందుకు ప్రజలను అనుమతించలేదు. పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలను అనుమతించకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సమైక్యవాదుల ఆందోళన కార్యక్రమాలు 16వ రోజు కొనసాగుతున్నాయి. మంత్రి రఘువీరా రెడ్డిని అడ్డుకునేందుకు న్యాయవాదులు
యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి రఘువీరా రెడ్డి రాజీనామా చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.