ఊపిరున్నంత వరకూ జగన్ వెంటే
వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి
అనంతపురం : ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. అప్పటి నుంచి వైఎస్ వెన్నంటే ఉన్నాం. విలువలతో కూడిన రాజకీయాలు వైఎస్ కుటుంబం నుంచే నేర్చుకున్నాం. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాం’ అని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బి. ఎర్రిస్వామిరెడ్డి స్పష్టం చేశారు.
తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి వైఎస్సార్‌సీపీని వీడుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తన నివాసంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీని మార్చాల్సిన దుస్థితి తమకు లేదన్నారు.
మిస్సమ్మ స్థలంపై అనవసర రాద్ధాంతం
మిస్సమ్మ స్థలంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎర్రిస్వామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా, అక్రమంగా ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేదని, వేలం ద్వారామ దక్కించుకున్నట్లు తేల్చిచెప్పారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చినా... కొందరు పనికట్టుకుని పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రైవేట్ పాపర్టీ అని స్వయంగా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మిస్సమ్మ స్థలంపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.